టూరిజం మంత్రిని కలిసిన ఏపీ కాపు కార్పొరేషన్ ఎం.డి.శివశంకర్
అమరావతి:
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతోందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. ఏపీ కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మంత్రి భూమా అఖిల ప్రియను మర్యాదపూర్వకంగా వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు. కర్నూలు జిల్లాలో కాపుల సంక్షేమానికి పథకాల అమలుపై మంత్రి ఎండి శివశంకర్ తో చర్చించారు. ఇప్పటికే నంద్యాలకు కాపు భవన్ మంజూరయిందని, అలాగే ఆళ్ళగడ్డలోనూ ఏర్పాటు చేయాలని అఖిల ప్రియ కోరారు. దీనికి ప్రతిపాదనలు రూపొందిస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామని ఎండి తెలిపారు. దీనితోపాటు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మహిళలకు టైలరింగ్ శిక్షణ యూనిట్లను ఆరు వరకు ఏర్పాటు చేయనున్నామన్నారు. మహిళలకు ఉచిత శిక్షణతోపాటు 3 వేల రూపాయల స్టయిఫండ్, కుట్టుమిషన్ అందిస్తామన్నారు. కాపు కార్పొరేషన్ నుంచి ఆటో డ్రైవర్లకు సబ్సిడీపై కార్లు కూడా అందించనున్నామని ఎం.డి. తెలిపారు. వీటన్నింటికీ ప్రతిపాదనలు సత్వరం రూపొందించాలని టూరిజం మంత్రి అఖిల ప్రియ అధికారులను కోరారు.