కర్ణాటకలో కమలం కకావికలం!!

Bjp

బెంగళూరు:

కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. చావుతప్పి కన్నులొట్ట పోయినట్టు ఒకచోట బీజేపీ గెలిచింది. బీజేపీ కంచుకోట శివమొగ్గలో తప్ప మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పకడ్బందీగా రచించిన వ్యూహానికి కాషాయ దళం కకావికలమైంది.

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప దాదాపు రెండున్నర లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి శివరామ‌ గౌడ 3 లక్షల 25 వేల తేడాతో గెలిచారు. షిమోగా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కర్ణాటక బీజేపీ అగ్రనేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర 52,148 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జామ్‌ఖండి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌ న్యామగౌడ సుమారు 40 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.సీఎం కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగర అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన కుమారస్వామి భార్య సీఎం అనితా కుమారస్వామి రికార్డు మెజారిటీతో గెలుపొంది బీజేపీకి గట్టి షాకిచ్చారు. అనితా కుమారస్వామి లక్షా 9వేల 137 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించేవారికి ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పు అని సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పార్టీ ఘోర పరాజయం పాలవడంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వెలవెలబోయింది. వచ్చే ఏడాది ఎన్నికలకు సమర సన్నాహాలు చేస్తున్న బీజేపీకి ఉప ఎన్నికల ఫలితాలు కోలుకోలేని షాకిచ్చాయి.