కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు

karnataka congress MLA Anandsingh

కర్ణాటక కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయం మరో మలుపు తిరిగింది. నిన్న ఆదివారం రాత్రి బెంగుళూరు సమీపంలోని ఈగిల్టన్ రిసార్ట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడిచేసి గాయపరిచిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ పై ఇవాళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆనంద్ సింగ్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆనంద్ సింగ్ తలపై జెఎన్ గణేష్ సీసాను పగులగొట్టినట్టు ఆరోపిస్తున్నారు.

వాచిపోయిన మొహం, తలపై పలు గాయాలతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు తెలిసింది. ఈగిల్టన్ రిసార్ట్ లో కొట్లాట విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జెఎన్ గణేష్ అంగీకరించారు. ఆనంద్ సింగ్ పై తాను పిడిగుద్దులతో దాడి చేసినట్టు గణేష్ తెలిపారు. ఆయనతో రాజీకి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

తన ప్రవర్తనపై ఎమ్మెల్యే జెఎన్ గణేష్ క్షమాపణలు కోరారు. దాడికి పాల్పడినందుకు ఆనంద్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులను క్షమాపణ కోరుతున్నట్టు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమలం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో గణేష్ కూడా ఉన్నారు.