కర్ణాటక ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు ఉపసంహరణ!!

కర్ణాటక ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు ఉపసంహరణ!!
karnataka government crisis

రాజ్ చెరుకూరి, బెంగళూరు:

కర్ణాటకలో రాజకీయం అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. హెచ్ డి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం అంచున నిలిచింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు హెచ్ నగేష్, ఆర్ శంకర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ‘సీఎం హెచ్ డి కుమారస్వామి అనేక రకాలుగా విఫలమయ్యారు. అందుకని మేం మా మద్దతు ఉపసంహరించుకుంటున్నామని’ ఆర్ శంకర్ తెలిపారు. ‘సంకీర్ణ భాగస్వాముల మధ్య అవగాహన లేదని’ మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్ నగేష్ విమర్శించారు. ‘సుస్థిర ప్రభుత్వం కోసం నేను బీజేపీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు’ ఆయన చెప్పారు.224 సభ్యుల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీఎస్ కు 37 మంది సభ్యుల బలం ఉంది. అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినవారిలో ఒకరు బీఎస్పీ సభ్యుడు కాగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బీఎస్పీ, ఇండిపెండెంట్లను కూడగట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలంటే కనీసం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి ఉంటుంది.