కథువా తీర్పు: ముగ్గురు దోషులకు జీవితఖైదు

జమ్ముకశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల పాపపై హత్యాచారం కేసులో పఠాన్ కోట్ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆరుగురు నిందితులను దోషులుగా ప్రకటించింది. వారికి శిక్షలు విధించింది. ముగ్గురు దోషులు సాంఝీ రామ్, పర్వేష్ దోషి, దీపక్ ఖజూరియాలకు జీవిత ఖైదు శిక్ష వేస్తున్నట్టు పఠాన్ కోట్ లోని ప్రత్యేక కోర్టు తెలిపింది. హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ఆనంద్ దత్తా, ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) సురేంద్ర వర్మలకు 5-5 సంవత్సరాల ఖైదు, రూ.50-50 వేల జరిమానా విధించింది. ప్రధాన నిందితుడు సాంఝీ రామ్ కుమారుడు (ఏడో ముద్దాయి) విశాల్ ను కోర్టు విముక్తుడిని చేసింది. ఈ కేసు విచారణ జూన్ 3న పూర్తయింది. ఈ దారుణ ఘటన యావద్దేశాన్ని కదిలించింది. 15 పేజీల ఛార్జిషీట్ ప్రకారం గత ఏడాది జనవరి 10న కిడ్నాపైన ఎనిమిదేళ్ల బాలికను కథువా జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న దేవాలయంలో బందీగా ఉంచారు. ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఆమెను చంపడానికి ముందు నాలుగు రోజుల పాటు స్పృహ కోల్పోయేలా చేశారు.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది.