కరెంటు వెలుగులపై కేసీఆర్ హర్షం.

cm Kcr

హైదరాబాద్:

విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసి దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్ల అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం చిమ్మచికట్ల నుండి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్ని రంగాలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళిక చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుత డిమాండ్ కు తగ్గ సరఫరా చేస్తూనే రాబోయే కాలంలో వచ్చే డిమాండ్ కు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు రాష్ట్రంలోని అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడడంలోనూ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా పాత్ర ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.