కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకి.-కోదండరాం:


హైదరాబాద్:

గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాలో ప్రజలకు వాటా ఉండాలన్నారు కోదండరాం. ప్రజల బాగోగుల గురించి కేసీఆర్‌ ఆలోచించడం ఎప్పుడో మానేశారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను కమీషన్ల కోసం కేసీఆర్ ఫ్యామిలీ సర్వనాశనం చేశారని కోదండరాం ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం ఆశపడి 40 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల కోట్ల రూపాయలకు పెంచారని కోదండరాం ఆరోపించారు. అడ్డగోలుగా పెంచిన 40 వేల కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్‌లో మిగిలి ఉంటే నిరుపేదలకు డబల్ బెడ్ రూం ఇళ్లు పూర్తయ్యేవని ఆయన చెప్పారు. ఇక కేసీఆర్‌ కంటి, పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారని.. మరి పేదలు వైద్యం కోసం ఎక్కడికెళ్లాలని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజ్యాంగ వ్యతిరేకిగా మారారని, ఆయన ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదని కోదండరాం విమర్శించారు. కేసీఆర్ కబంద హస్తాల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు.