kcr schemes

Kcr

అర్బన్, సెమీ అర్బన్, ఒక స్థాయి పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు సానుకూలంగా ఏమీ లేవు. నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్న కుటుంబాల్లో ‘లబ్ధిదారులు’ ఉన్నప్పటికీ వారంతా టిఆర్ఎస్ కు వ్యతిరేకమైన అభిప్రాయంతో ఉన్నట్టు తెలియవచ్చింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ వాతావరణం ఉన్న పేద గ్రామాలు, మండల కేంద్రాలు ఎక్కువ. అందువల్ల కేసీఆర్ ‘సంక్షేమ సెంటిమెంటు’ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఇదమిద్ధంగా చెప్పలేం. పైగా ‘భూ రికార్డుల ప్రక్షాళన’ పేరిట జరిగిన ప్రహసనం, రెవెన్యు సిబ్బంది రైతులను పేల్చి పిప్పి చేసిన వైనాన్ని, వాళ్ళు పాల్పడిన ‘దోపిడీ’ ని సామాన్య, పేద రైతాంగం మరచిపోవడం లేదనేది మరొక విశ్లేషణ!

పథకాలే ఓట్లు రాల్చునా !!
ప్రత్యర్థులను కూల్చునా !!

ఎస్.కె.జకీర్.

Kcr

కేసీఆర్ మొదటిసారి ‘ఒంటరిగా’ ? పోటీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో, 2009 లో తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తులు పెట్టుకొని పోటీ చేశారు. 2014 లో తెలంగాణ సాధించిన ‘విజయం’ అనే సెంటిమెంటుతో ‘పొత్తు’ పెట్టుకున్నారు. కనుక సాధారణ ఎన్నికల్లో ఆయన ‘విడిగా’ పోటీ చేయడం ఇదే ప్రధమం. 2014 ఎన్నికల నాటికి కేసీఆర్ కు ‘నికర ఓటుబ్యాంక్’ లేదు. 2014 ఎన్నికల తర్వాత కూడా నికర ఓటు బ్యాంకు తయారు కాలేదు. గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ‘లబ్దిదారులంతా’ తన ఓటు బ్యాంకు గా కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. 2014 ఎన్నికల నాటికి తెలంగాణలో మొత్తం ఓట్లు 2 కోట్ల, 93 లక్షల మంది. పోలైన ఓట్లలో 66 లక్షల 20 వేల ఓట్లతో 63 అసెంబ్లీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ గెలిచింది. తర్వాత ‘రాజకీయ పునరేకీకరణ ‘ పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యను 90 దాకా తీసుకు వెళ్లిన ఘనత కేసీఆర్ కె దక్కింది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందిన వారు 2 కోట్ల మంది ఉన్నట్టు కేసీఆర్ లెఖ్ఖ. ఇందులో నేరుగా ప్రయోజనం పొందిన వారు 95 లక్షల మంది ఉన్నట్టు టిఆర్ఎస్ నాయకుల కథనం. ఓటర్లతో టిఆర్ఎస్ ‘క్విడ్ ప్రో కో’ వలె వ్యవహరించదలచుకున్నది. ”మీకు మా ప్రభుత్వం ద్వారా ఇంత ప్రయోజనం లభించినందున మీరు మీ ఓటు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి” అన్నది కేసీఆర్ సందేశ విజ్ఞప్తి. ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ‘సంక్షేమ లబ్ధిదారుల’ తుపాను వీయనున్నట్టు కేసీఆర్ అంచనా. బలమైన నమ్మకం. అందువల్ల ఆయన 100సీట్లను సునాయాసంగా గెలుస్తామని చెబుతున్నారు. కానీ అర్బన్, సెమీ అర్బన్, ఒక స్థాయి పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు సానుకూలంగా ఏమీ లేవు. నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్న కుటుంబాల్లో ‘లబ్ధిదారులు’ ఉన్నప్పటికీ వారంతా టిఆర్ఎస్ కు వ్యతిరేకమైన అభిప్రాయంతో ఉన్నట్టు తెలియవచ్చింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ వాతావరణం ఉన్న పేద గ్రామాలు, మండల కేంద్రాలు ఎక్కువ. అందువల్ల కేసీఆర్ ‘సంక్షేమ సెంటిమెంటు’ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఇదమిద్ధంగా చెప్పలేం. పైగా ‘భూ రికార్డుల ప్రక్షాళన’ పేరిట జరిగిన ప్రహసనం, రెవెన్యు సిబ్బంది రైతులను పేల్చి పిప్పి చేసిన వైనాన్ని, వాళ్ళు పాల్పడిన ‘దోపిడీ’ ని సామాన్య, పేద రైతాంగం మరచిపోవడం లేదనేది మరొక విశ్లేషణ. ‘తెలంగాణ సెంటిమెంటు’ పచ్చిగా ఉన్న సమయంలో,స్వరాష్ట్రం సిద్దించిన సందర్భంలో 2014 ఎన్నికలు జరిగినవి. ఉత్తర తెలంగాణలోని 54 అసెంబ్లీ స్థానాలకు గాను 44సీట్లను టిఆర్ఎస్ గెలుచుకుంది.దక్షిణ తెలంగాణలో 65 సీట్లకు గాను 19సీట్లను టిఆర్ఎస్ గెలుచుకున్నది. ఉత్తర తెలంగాణలో 20 మంది కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోయారు.ఇప్పుడు వాళ్లలో 15 మంది టిఆర్ఎస్ కు గట్టి పోటీనిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో టిఆర్ఎస్ గెలిచిన 19 సీట్లలో నల్గొండ కు చెందినవి 6 , మహబూబ్ నగర్ జిల్లా లో 7 సీట్లు ఉన్నవి. ఉమ్మడి నల్గొండ , మహబూబ్ నగర్ జిల్లాలోని 26 అసెంబ్లీ సీట్లలో 5, 6 కు మించి సీట్లు టిఆర్ఎస్ కు సానుకూలంగా లేవన్నది కాంగ్రెస్, టిడిపి నాయకుల కథనం. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 సీట్లు ఉండగా 5సీట్లను టిఆర్ఎస్ గత ఎన్నికల్లో గెలుచుకోగలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో 1 సీటును టిఆర్ఎస్ గెలుచుకొని చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బయటపడగలిగింది. తమ ప్రభుత్వ జనరంజక పాలన వల్ల ఇటు దక్షిణ తెలంగాణలోనూ, ఒక సామాజిక వర్గం ఎన్నికలను ప్రభావితం చేయనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాము ‘స్వీప్’ చేసిపారేస్తామని టిఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని 54 సీట్లలో ‘ప్రజాకూటమి’ తక్కువలో, తక్కువగా 30 దాకా గెలుస్తుందని కాంగ్రెస్ నాయకుల అంచనా. దక్షిణ తెలంగాణలో గతంలో కైవసం చేసుకున్న 19సీట్లను అధికారపక్షం ఈ సారి సాధించడం కష్టమని వారంటున్నారు. దీంతో నగర శివార్లలోని స్థానాలపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు వేరు. బహిరంగ ప్రచారంతో పాటు బూత్‌ స్థాయిలోనూ ఎన్నికల ప్రచారానికి గ్రేటర్ ఇన్ ఛార్జ్ , టిఆర్ఎస్ సంక్షోభ పరిష్కర్తకేటీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నవి. గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. 150డివిజన్లకుగానూ రికార్డు స్థాయిలో 99డివిజన్లను కైవసం చేసుకున్నది. టీడీపీకి కంచుకోటగా ఉన్న స్థానాల్లో సైతం టీఆర్‌ఎస్‌ పాగా వేసింది.కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ కార్పొరేటర్లలో తీవ్ర అసమ్మతి కనిపిస్తున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ‘టీడీపీ, బీజేపీ కూటమి’ నగర శివార్లలో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకున్నది. బిజెపి, టిడిపి 8 స్థానాల్లో విజయం సాధించినవి. ఇందులో టీడీపీ ఏడు స్థానాలు గెలుచుకుంది. అయితే టీడీపీటికెట్టుపై గెలిచిన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కు పార్టీ ఫిరాయించారు. ఎల్‌బీనగర్‌లోటీడీపీతరుపున గెలిచిన ఆర్‌. కృష్ణయ్య ఒక్కరే ఆ పార్టీ తరుపున మిగిలారు. కాంగ్రెస్ సారధ్యంలోని ‘ప్రజాకూటమి’ ఏర్పాటు తరువాత పరిస్థితులు మారినందున ఫలితాలు ‘ఏకపక్షంగా’ ఉండే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరాట దృశ్యాలు కనిపిస్తున్నవి. ఎన్నికల ప్రకటనకు ముందు ఉన్న పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా తారుమారైనవి. ఆయా పార్టీల బలాబలాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. సెప్టెంబర్ 6 న అసెంబ్లీ రద్దు సమయంలో తమకు రాష్ట్రంలో తిరుగులేదని కేసీఆర్ భావించారు. అప్పటి పరిస్థితులు కూడా దాదాపు అలాగే కనిపించాయి. అయితే అభ్యర్థుల ప్రకటన తరువాత టీఆర్‌ఎస్ లో కొన్ని చోట్ల తిరుబాట్లు జరిగాయి. అసంతృప్తులు కనిపించాయి. కొన్ని చోట్ల అభ్యర్ధులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అనేక చోట్ల అధికార టీఆర్‌ఎస్‌, మహాకూటమి మధ్య పోటాపోటీ సమరం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి.ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రెండు పద్ధతుల్లో నిర్వహించేందుకు టిఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యనేతలు, పార్టీ అభ్యర్థుల రోజు వారీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అలాగే క్షేత్రస్థాయిలో మరో ‘వ్యవస్థ’ను సమాంతరంగా ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగు బూత్‌కు 15 మందిని ప్రత్యేకంగా ‘టాస్క్ ఫోర్స్’ వలె నియమించింది. ఇందులో ప్రతి ఒక్కరు దాదాపు వంద మంది ఓటర్లతో నిత్యం ‘టచ్‌’లో ఉంటారు. ‘బూత్‌స్థాయి’లో ఓటర్లను గుర్తించడంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, బూత్‌స్థాయిలో ఆయా పార్టీల బలాబలాలను బేరీజు వేసి ఎప్పటికపుడు కేంద్ర పార్టీకి, తెలంగాణ భవన్ కు సమాచారం పంపించడం వారి పని.తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా ‘ఎన్నికల సెల్’ ఏర్పాటవుతుంది. వీరు ఇచ్చే నివేదికల ఆధారంగా కేంద్ర కమిటీ నుంచి క్షేత్రస్థాయిలో ఉండే నాయకులకు సూచనలు అందుతుంటాయి. పార్టీకి ఇబ్బంది ఉంటే వెంటనే కొనుక్కొని పరిస్థితిని చక్కదిద్దాలన్నది కేసీఆర్ వ్యూహం.ఇదే కాకుండా అన్ని కులసంఘాలతో టిఆర్ఎస్ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘తెలంగాణేతరుల’ పై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టిని సారించింది. వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ప్రాంతాల వారీగా కూడా సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2015 కల్లా చంద్రబాబునాయుడును టార్గెట్ చేయడంతో ‘భయపడిన’ కారణంగానే హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ ఎన్నికలలో ‘సెటిలర్లు’ టిఆర్ఎస్ కు ఓటేసినట్టు ఒక విశ్లేషణ ఉన్నది. ఆ విశ్లేషణపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే ఈ సారి అలాంటి పరిస్థితులు లేవని ‘సెటిలర్లు’ చెబుతున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రజా ఆశీర్వాద సభల’ పేరిట జరుగుతున్న సభల్లో చంద్రబాబు నాయుడుపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న విమర్శలు, దూషణలను హైదరాబాద్ లో స్థిరపడ్డ ‘ఒక సామాజిక వర్గం’ జీర్ణించుకోలేకపోతోంది. ఐటీవలకేటీఆర్ పర్యటనలో కొందరు ఈ విషయమై ఆయనను నిలదీశారు. దానిపై కేటీఆర్ ఎంతో సంయమనంతో, పరిణతితో ‘సెటిలర్ల’ ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ తన ‘ఆంధ్రా వ్యతిరేక’ నిజస్వరూపం నిరూపించుకుంటూనే ఉన్నారని కొందరు సెటిలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ పోరాటాయోధుడు బలహీనవర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి చెందితే పరామర్శకు వెళ్ళలేదని, కొండగట్టు క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదని గుర్తు చేస్తున్నారు. ”హైదరాబాద్ నగరం చుట్టుపక్కల రియలేస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పోలీసులతో ప్రజల్ని బెదిరించి భయపెట్టి అక్రమ కేసులు పెట్టి వందలాది ఎకరాల భూములను టిఆర్ఎస్ అండ దండలతో ఆక్రమించారు.చెరువులు వాగులు వంకలు పూడ్చిన అక్రమ లే అవుట్లకు అనుమతులు ఇచ్చారు” అన్న ఆరోపణలు కూడా వస్తున్నవి.ప్రధాన స్రవంతి మీడియా కన్నా సోషల్ మీడియా, వాట్సప్లలో ప్రజలు నేరుగా, వేగంగా వాస్తవాలు, వార్తలు చేరవేసుకుంటున్నట్టుసెటిలర్లు చెబుతున్నారు.
Kcr Schemes