మోదీ! భారీ మూల్యం తప్పుదు. -చంద్రబాబు:

మోదీ! భారీ మూల్యం తప్పుదు.
-చంద్రబాబు:
null

కోల్‌కతా:

రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.టీఎంసీ మెగా ర్యాలీలో చంద్రబాబు మాట్లాడుతూ, కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపుతప్పుతున్నాయని అన్నారు. ఏమాత్రం అనుభవం లేని రిలయెన్స్‌కు రాఫెల్ డీల్ కట్టబెట్టడం ఏమిటని మోదీ సర్కార్‌ను నిలదీశారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. దేశమే అందరికీ ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.బెంగాలీలో ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న బీజేపీ వ్యతిరేక పార్టీల సమైక్య బల ప్రదర్శన సభకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు బెంగాలీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇలాంటి గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది చరిత్రాత్మక రోజు అని చంద్రబాబు అభివర్ణించారు. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభి దీదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. అనంతరం తన ప్రసంగాన్ని ఆంగ్లంలో కొనసాగించారు.