న‌గ‌రంలో ద‌శ‌ల‌వారిగా ప‌ర్యావ‌ర‌ణహిత ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు:మంత్రి కె.టి.ఆర్‌.

హైదరాబాద్;
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప్ర‌స్తుతం ఉన్న గార్బెజ్ క‌లెక్ష‌న్ వాహ‌నాల స్థానంలో ద‌శ‌లవారిగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి, ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యం బ‌స్టాప్‌ల వ‌ద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎయిర్ కండీష‌న్ బ‌స్‌షెల్ట‌ర్ల‌ను మంత్రి నేడు ప్రారంభించారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, చింత‌ల రామ‌చంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్న ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని అన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా నిర్వ‌హించే వాహ‌నాలతో పాటు ఆర్టీసి ద్వారా తిరిగే 3,800 సిటీ బ‌స్సుల స్థానంలో ద‌శ‌ల‌వారిగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశపెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జా ర‌వాణాకు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు ఇత‌ర ప్ర‌త్యామ్నాయ ర‌వాణా మార్గాల‌ను చేప‌డుతున్నామ‌ని తెలిపారు. మ‌రో ఐదు నెల‌ల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో 820 ఆధునిక బ‌స్ షెల్ట‌ర్ల‌ను ప‌బ్లిక్ ప్ర‌వేట్ పార్ట్‌నర్‌షిప్ ప‌ద్ద‌తిలో జీహెచ్ఎంసీ ఏమాత్రం ఖ‌ర్చులేకుండా ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఏసితో పాటు వైఫై, మొబైల్ చార్జింగ్‌, టాయిలెట్స్‌, మంచినీటి సౌక‌ర్యం, సీసీటివి, కెఫెటేరియా, రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్ ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌లిగిన ఈ ఆధునిక బ‌స్‌షెల్ట‌ర్ల‌ను ప‌రిర‌క్షించుకునే బాధ్య‌త న‌గ‌రవాసుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. స‌మ‌గ్ర స‌దుపాయాలు క‌లిగిన ఈ విధ‌మైన ఆధునిక ఏసి బ‌స్‌షెల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం దేశంలోనే మొద‌టిసారని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు విజ‌యరెడ్డి, జానకిరామ‌రాజు, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు భార‌తిహోలికేరి, అద్వైత‌కుమార్‌సింగ్, జోన‌ల్ క‌మిష‌న‌ర్ శంక‌ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.