మా కొల్లాపురం. మన్మోహన్ రంగినేని:

మా కొల్లాపురం.

మన్మోహన్ రంగినేని:

Deccan development society

నాకు తెలిసిన మా చిన్ననాటి సంగతులు చెప్పుకోవాలి. ఆరోజుల్లో ఎక్కువగా కొర్రబువ్వనే. పుంటికూర పప్పు, మజ్జిగ combination.
తైదలు, జొన్నలతో అంబలి, సంకటి. రొట్టెలు. ఎల్లిపాయ మిరప్పొడి, సీజనల్ గా రకరకాల ఆకుకూరలు, కాయగూరల తొక్కులు. రోట్లో వేసి నూరుతుంటే… ఆ కమ్మటి వాసనకు నోట్లో నోరూరకపోతే ఒట్టు.అప్పుడప్పుడు… పండుగలప్పుడు… సుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే తెల్లబువ్వ. చాపలు, నాటు కోడి కూర. యాట కూర దొరకడం సానా తక్కువ. సంత దినం రోజున దొరికేది. ఇంగ… గిప్పుడు దొరికే బాయిలర్ చికెన్… ఆరోజుల్లో ఎక్కడిదీ?!
పిల్లలకు దొరికే చిరుతిండ్లు కూడా… బుడ్డల పట్టీలు, బొరుగుల, నూగుల ఉండలు. శనగలు, బఠానీలు… దౌడలు గుంజేది. తినడం కూడా అదో కసరత్తు. ఏదీ దొరక్కపోతే ఇంట్లో ఉన్న అలుగడ్డలు, వంకాయలు నిప్పుల్లో కాల్చుకుని… లొట్టలు వేసుకుంటూ తినేది. ఇప్పుడున్న విషం నిండిన బర్గర్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్ వంటివి లేకపోవడం అదృష్టమే.ఇక ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా అందరికీ నడక, పరుగు. చెమటలు కారిపోయేవి. బాలల నుండి వృద్ధుల దాకా ప్రతిరోజూ… ప్రతి నిమిషం… ప్రతి పనిలో శారీరక కష్టం స్పష్టంగా ఉండేది.ఓహ్… ఆరోజుల్లో… సైకిల్… మాకు అదొక పుష్పక విమానమే. ఇక పిల్లల ఆటలు, బావిలో ఈతలు. రోజూ… ఒళ్ళు పులిసిపోవడం తప్పనిసరి. పయ్యంతా దెబ్బలే. ఇంట్లో తెలిస్తే… మళ్లీ వీపులు విమానం మోత. పంటి బిగువున భరిస్తూ మౌనంగా.. అవే… మానిపోయేవి. ఇక నేటి ఆధునిక కాలం. మెండుగా సౌకర్యాలు. అడుగు కింద పెట్టే అవసరమే లేదూ. కష్టం… చెమట అంటే తెలియని పిదపకాలం. మట్టిని తాకితేనే కందిపోతారని… పిల్లల కాలు కూడా కింద పెట్టనివ్వని తల్లిదండ్రుల అతి (మూర్ఖ) గారాబం. చిట్టచివరకు… వాళ్ళొక గాజు బొమ్మలు అవుతున్నారు. కొద్దిగా పెరిగిన చలి… వాన… ఎండకు తట్టుకోలేని బలహీనపు జీవులు అవుతున్నారు.ఎవరిదీతప్పిదం… ఎక్కడ లోపం.అంతా మన చేతుల్లోనే ఉంది. జీవనవిధానంలోని లోపాలను, ఎచ్చులను అధిగమిస్తేనే… ఆరోగ్యకర సమాజం.
రేపటి తరం బలం… జ్ఞానం… ఉత్సాహం… చైతన్యం… ధర్మం… విజయాలకు తల్లిదండ్రుల ఆలోచన విధానమే కారణం. ఉరికించండి పిల్లలను… మోటుతనం తేలేలా మోకాళ్ళపై నడిపించాలి. దేశాన్ని కాపుగాసే కమెండోల కష్టంలోని రుచి రవ్వంతయినా మన పిల్లలకు అందించాలి. అప్పుడు చూద్దాం… ఖచ్చితంగా… రేపు లేదా ఎల్లుండి… శక్తివంతమైన సమాజం ఏర్పడుతుంది. ఇది నూరుపాళ్లు నిజం… శుభమస్తు…ఒక రచయితగా… ఈ విషయం అందరి ముందుంచటానికి కొద్దిగా శ్రమ తప్పలేదు.