నిర్మాణానికి ముందే కూలిపోనున్న ‘కూటమి’!! బిజెపితో కోదండరాం కూటమి వెనుక……

 

రాష్ట్రంలో టిఆర్ఎస్ తర్వాత బలమైన రాజకీయశక్తి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి అన్ని హంగులు ఉన్నవి. హేమీహెమీలు ఉన్నారు. అంగబలం, ధనబలం ఉన్నాయి. కేసీఆర్ తో తలపడే విషయంలో అవసరమైన వేగం, సమన్వయం, కసి, పగ, ప్రతీకారాలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు. కేసీఆర్ చాణక్యాన్ని తునాతునకలు చేయగలిగిన ‘వ్యూహకర్త’ లేడు. కాంగ్రెస్ లో టిఆర్ఎస్ కు కోవర్టులు, ఇన్ ఫార్మర్లు ఉండడం, కేసీఆర్ కు లాభం చేకూరే రీతిలో కార్యకలాపాలు చేపట్టడం… మరో చర్చ. 2014 జూన్ 2 న తెలంగాణ అవతరణ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్తబ్దంగా ఉన్నదో ఆ పార్టీ నాయకుల వద్ద జవాబు లేదు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి పర్యటనలకు చాలా ఆలస్యంగా శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగదని, మరికొన్ని పార్టీలను కలుపుకొని వెడుతుందని కేసీఆర్ కు ముందే ‘ఉప్పందింది’. అటు కోదండరాం పార్టీ నిర్మాణ దశలో ఉన్నది. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కేసీఆర్ కు సంపూర్ణ అవగాహన ఉన్నది. 2004 లో కాంగ్రెస్ తో, 2009 లో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు సీట్ల సర్దుబాటు ఎంత క్లిష్టమైనదో ఆయనకు తెలుసు. కనుక ఈ సర్దుబాట్లు, చర్చలు, సమావేశాలు ఒక కొలిక్కి రాక మునుపే అనూహ్యంగా ‘ముందస్తు’ బాంబు పేల్చారు. దీంతో ప్రతిపక్షాలు కకావికలమైనవి.105 మంది అభ్యర్థుల ప్రకటన మరో బాంబు. దెబ్బ మీద దెబ్బలా కేసీఆర్ జరుపుతున్న ‘వ్యూహాత్మక దాడుల’ను తిప్పిగొట్టే సామర్ధ్యం ప్రతిపక్షాలకు లేదు. లేదా ప్రజల్లో ఉన్న అనుమానాల ప్రకారం కొందరు కాంగ్రెస్ ప్రముఖులే ‘లొంగిపోయారా’? తెలియదు. కేసీఆర్ ను ఓడించడమనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, జనసమితి, తెలుగుదేశం, సిపిఐల మధ్య ‘ఒడంబడిక’ జరగవలసి ఉన్నది. ఈ ఒడంబడిక కు ఇప్పుడు చివరి నిమిషంలో హడావుడి పడితే లాభమేమిటి? ఇంతకాలం ఏమి చేశారు? ”కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన”కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు ఎందుకు ప్రయత్నించలేదు. ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు ‘పెద్దన్న’ కాంగ్రెస్ ఎందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను ‘రాజకీయ శక్తి’ గా మలిచేందుకు గట్టి ప్రయత్నాలు జరిపి ఉంటె, ఆ సంకల్పంలో నిజాయితీ ఉంటె ఈ అవస్థలు ఉండేవి కావు. ఇప్పటికే ‘కేసీఆర్ వ్యతిరేక ఐక్య సంఘటన’ కు పునాదులు బలంగా పడి ఉండేవి. కూటమి నిర్మాణంలో అవరోధాలు ఉండేవి కాదు. ఎన్నికలు సమీపించినప్పుడు ఇలాంటి ‘కూటమి’ నిర్మాణానికి పూనుకుంటే ఈ గొడవలు తప్పవు. తెలంగాణా జన సమితి ఏర్పడినప్పుడే కాంగ్రెస్ తదితర రాజకీయ సంస్థలు, వ్యక్తులతో కోదండరాం ‘ఐక్య సంఘటన’పై సంభాషించారా? అటువంటి ప్రయత్నానికి అడ్డంకులు ఏమి ఏర్పడినవి?

ఎస్.కె.జకీర్.
‘కేసీఆర్ వ్యతిరేక కూటమి’ నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయే సూచనలు కనిపిస్తున్నవి. ఇందుకు కారణాలు అనేకం. ఎవరి సిద్ధాంతాలు వారివి. ఎవరి ఎజండా వారిది. బయటకు కనిపించేదంతా నిజం కాదు. కనిపించనిది నిజం కాకుండా పోదు. అసలు ‘మహాకూటమి’ అని నామకరణం చేసిందెవరు? మీడియా నా? లేక కాంగ్రెస్ పార్టీ యా? భావసారూప్యం కల రాజకీయ సంస్థల మధ్య అవగాహనగానో , సీట్ల సర్దుబాటుగానో చెప్పుకుంటే సరిపోయేది. ‘మహా కూటమి’ అన్న పేరు ఫ్లాప్ అయిన అనుభవం ఉండనే ఉన్నది. ‘కూటమి’లో భాగస్వామ్యపక్షాలుగా కాంగ్రెస్,తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి లను పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈ నాలుగు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నవి. ‘రహస్య’ సమావేశాలు జరుగుతున్నవి. భారతీయ జనతా పార్టీ, సిపిఎం ఈ సోకాల్డ్ ‘కూటమి’కి వెలుపలే ఉండిపోయినవి. బిజెపి ఎలాగూ ఇతర పార్టీలతో జట్టు కట్టే అవకాశాల్లేవు. బిజెపితోను ఎవరు జట్టు కట్టరు. అది వేరే చర్చ. మిగతా పార్టీలు తమకు తాము లౌకికవాద పార్టీలుగా భావిస్తున్నవి. కనుక ‘మతతత్వ’ బిజెపితో పొత్తులను వ్యతిరేకిస్తుంటాయి.ఇక మార్క్సిస్టు పార్టీ వైఖరి అనూహ్యంగా, అనుమానాస్పదంగాను ఉన్నది. ఆ పార్టీ ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ కు సారధ్యం వహిస్తున్నది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున పోటీ చేసే 27 మంది తో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను కూడా కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. ”టిఆర్ఎస్ c టీమ్ విడుదలయింది” అని ఆ జాబితా వెలువడిన మరుక్షణం జర్నలిస్ట్ మిత్రుడొకరు నాకు ఫోన్ చేసి వ్యంగ్యంగా కామెంటు చేశారు. మరి b టీమ్ ఎవరని అడిగితే బిజెపి అని కూడా ఆయన అన్నారు. అది ఆ మిత్రుని అవగాహన. అందులో నిజం ఉన్నదా? హేతుబద్ధత ఎంత అన్నది? బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థుల పోటీ తీరు, ప్రచార పర్వం వల్ల కొంత అంచనాకు రావచ్చును. ఇప్పటికిప్పుడు ఈ నింద ‘కామ్రేడ్ల’ పై వేయడం సరికాకపోవచ్చు. తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ కు, కేసీఆర్ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న పోరాటమని ప్రత్యేకంగా నిర్వచించవలసిన అవసరమేమీ లేదు. అందువల్ల కేసీఆర్ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా వర్గీకరించదలచుకున్నప్పుడు సహజంగానే సిపిఎం వైఖరి చర్చకు వస్తుంది. ”సామాజిక న్యాయం కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడింది. రాష్ట్రంలో టిఆర్ఎస్, బిఎల్ఎఫ్, మహాకూటమి అనే మూడు కూటములు ఉన్నాయి” అని సిపిఎం తెలంగాణ యూనిట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

”టిఆర్ఎస్ తెలంగాణలో మజ్లీస్ తో, ఢిల్లీలో బిజెపితో మాయాకూటమి నిర్మిస్తున్నది”. అని కూడా ఆయన అంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వ్యవహారాన్ని కొద్దీ సేపు పక్కన బెడితే మిగతా ‘కుంపట్ల’ సంగతేమిటి? ‘తెలంగాణ ఇంటిపార్టీ’ పేరుతో డాక్టర్ చెరుకు సుధాకర్ ఒక పార్టీ నడుపుతున్నారు. ‘తెలంగాణ ప్రజల పార్టీ’ పేరుతో జస్టిస్ చంద్రకుమార్ మరో పార్టీని నడుపుతున్నారు. ఇలాంటి రాజకీయపార్టీలు ఇంకా కొన్ని ఉండవచ్చు. కానీ అవి పెద్దగా ఉనికిలో లేవు. ”రానున్న ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తాం. మహాకూటమి, బి ఎల్ ఎఫ్ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నవి. మేము అధికారంలోకి వస్తే బిసి ని ముఖ్యమంత్రిని చేస్తాం. మహిళను ఉప ముఖ్యమంత్రిని చేస్తాం. ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో ఎన్నికల చిహ్నం కేటాయిస్తారు” అని జస్టిస్ చంద్రకుమార్ సెప్టెంబర్ 28 న చెప్పారు. ”మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాసరెడ్డి, వరంగల్ నుంచి రియాజ్ అహ్మద్, షాద్ నగర్ నుంచి రామేశ్వర్ గౌడ్ లకు మా పార్టీ వైపు నుంచి మహాకూటమి టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్, భువనగిరి, మునుగోడులలో ఒక సీటు ఇవ్వాలి”. అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ, సిపిఎం ల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. మహాకూటమిని ‘బేస్ లెస్’ కూటమిగా కామ్రేడ్ తమ్మినేని అన్నారు. ”బిఎల్ఎఫ్ బేస్ లెస్” అని సిపిఐ తెలంగాణ యూనిట్ కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సిపిఐ మహాకూటమిలో చేరడాన్ని సిపిఎం తప్పు బడుతుండగా, సిపిఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను సిపిఐ తప్పుబడుతున్నది. ఇక తెలంగాణ జన సమితి గురించి ప్రత్యేకంగా చర్చించాలి. ఈ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ జెఎసి పూర్వాధ్యక్షుడు కోదండరామ్ ‘ కూటమి’ లో ముఖ్య క్రీడాకారుడు. తనకు తానే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా భావిస్తున్న వ్యక్తి. ” జెఎసి పేరిట కాదు. బయటకు రా! చూసుకుందాం” అని కేసీఆర్ రెచ్చగొట్టడం, ఆ ‘ఉచ్చులో’ పడి ప్రొఫెసర్ కోదండరాం ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటుకు ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి విద్యాధర రెడ్డి వంటి వారంతా ఇప్పుడు ఆ పార్టీలో కీలకం.

తెలంగాణలో ఉన్న సీట్లు 119. అవి మారవు. పెరగవు. కేసీఆర్ ను గద్దె దింపాలన్న లక్ష్య సాధనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టిడిపి తదితర పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయించుకుంది. సీట్ల పంపకం వ్యవహారాల్లో ఒకటి ఎక్కువో, ఒకటి తక్కువో టిడిపి, సిపిఐ ఏదో మేరకు ‘రాజీ’ పడే అవకాశాలు కనిపిస్తున్నవి. ఆ మేరకు చర్చల సరళి కనిపిస్తున్నది. ఎటొచ్చి ‘జన సమితి’ దగ్గరే ప్రతిష్టంభన ఎదురవుతున్నది. మొదట 30 అసెంబ్లీ స్థానాలు కావాలని కోదండరాం పార్టీ కోరినట్టు వార్తలు వచ్చాయి.తర్వాత ఆ సంఖ్య 22 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఎన్ని సీట్లకు తగ్గనున్నారో, ఎక్కడ ముడి విడివడుతుందో, ఏ సంఖ్య దగ్గర రాజీ కుదురుతుందో తెలియదు. అసలు తెలంగాణ జన సమితికి ఉన్న బలమెంత? బలగాలు ఏమిటి? ఏయే అసెంబ్లీ నియోజకవర్గాలలో టిఆర్ఎస్ తో గట్టి పోటీ నిచ్చే అభ్యర్థులు ఉన్నారు? వీటికి సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ జరిగిందా? ఆయా సెగ్మెంట్లలో రాజకీయ పక్షాల బలాబలాలపై సరైన అంచనా ఉన్నదా? సర్వేలు చేయించారా? కోదండరాం కు ఒక ‘బ్రాండ్’ ఇమేజ్ ఉన్న మాట నిజమే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమానికి చెందిన అనేక మలుపులతో ఆ ‘ఇమేజ్’ ముడిపడి ఉన్నది. కేసీఆర్ ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అత్యంత బలశాలి. పరాక్రమవంతుడు. తెలంగాణ అంతటా ఆయన్ను వీరునిగా ఆరాధించే వారున్నారు. తమ పాలిట దేవుడనుకునే వారు కూడా ఉన్నారు. 4 కోట్ల జనాభాలో 1 కోటి మందిని కేసీఆర్ ‘వశపరచుకున్న’ మాట నిజం. రైతుబంధు 8 వేల రూపాయలు కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు…. ఇంకా అనేకానేక పధకాల ద్వారా వారందరినీ ‘లబ్దిదారులు’ గా మార్చుకున్నారు.కొన్ని జిల్లాల్లో సాగునీటి వసతి పెరిగింది. ఆ ప్రాంతాల్లో రైతులు సంతోషంగా ఉన్నారు. వ్యవసాయం కొంత పుంజుకుంది. సాగునీటి సౌకర్యాల కల్పనలో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంట్రిబ్యూషన్ ను గుర్తించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, కూతురు, ఎంపీ కవిత నిరాకరిస్తుండవచ్చు. లేదా ప్రత్యేకంగా హరీశ్ ప్రస్తావన చేయకుండా కథ నడిపించాలని అనుకుంటున్నారేమో! క్షేత్ర స్థాయిలో టిఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ అంచనా వేస్తున్న, లేదా ఊహిస్తున్న విధంగా అంత అధ్వాన్నంగా ఏమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘తిరుగుబాటు’ చేయాలన్న కసి ప్రజల్లో కనిపించడం లేదు. అలాగే టిఆర్ఎస్ కు అనుకూలంగా గాలి వీస్తున్నట్టుగా కూడా ఆధారాలు లేవు. చాలా చోట్ల అధికార పక్షం అభ్యర్థులకు గట్టి పోటీ తప్పదన్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ అప్రజాస్వామిక పాలన, గడీ పాలన, నియంత పోకడలు, నిరంకుశ ధోరణి, ప్రజల్ని కలవకపోవడం, సచివాలయానికి రాకపోవడం, ఫామ్ హౌజ్ లోనే అప్పుడప్పుడు రోజుల తరబడి మకాం వేయడం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, ప్రశ్నించే వారి గొంతు నులమడం… వంటి అంశాలు టివి న్యూస్ చానళ్ళ చర్చల్లో, ఇతర మేధో మధన సమావేశాల్లో బాగానే ఉంటాయి.

టిఆర్ఎస్ పాలనకు ప్రత్యమ్నాయంగా తెలంగాణలో తీసుకు రాదలచుకున్న పాలన నమూనా ఏమిటి? తెలంగాణ సెంటిమెంటును ఆయుధంగా మలచుకోవాలని కోదండరాం భావిస్తున్నారు. అందుకే అమరుల ఆకాంక్షల సాధనను ముందుకు తెస్తున్నారు. 1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఆవిర్భవించిన తెలంగాణా ప్రజా సమితి ఎన్నికల చిహ్నం ‘పార’ గుర్తును తమకు కేటాయించాలని టిజెఎస్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నది. టిజెఎస్ కోరిక నెరవేరవచ్చు. అంత మాత్రాన ఒరిగేదేమిటి? తెలంగాణ సెంటిమెంటును ‘ఓవర్ టేక్’ చేయడానికి కేసీఆర్ చేయని ప్రయత్నమంటూ లేదు. నాలుగున్నర సంవత్సరాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించకపోయినా, తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం ఏర్పాటు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నప్పటికీ గట్టిగా అడిగిన వారు లేరు. నిలదీసిన వారు లేరు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తర్వాత బలమైన రాజకీయశక్తి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి అన్ని హంగులు ఉన్నవి. హేమీహెమీలు ఉన్నారు. అంగబలం, ధనబలం ఉన్నాయి. కేసీఆర్ తో తలపడే విషయంలో అవసరమైన వేగం, సమన్వయం, కసి, పగ, ప్రతీకారాలు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటు. కేసీఆర్ చాణక్యాన్ని తునాతునకలు చేయగలిగిన ‘వ్యూహకర్త’ లేడు. కాంగ్రెస్ లో టిఆర్ఎస్ కు కోవర్టులు, ఇన్ ఫార్మర్లు ఉండడం, కేసీఆర్ కు లాభం చేకూరే రీతిలో కార్యకలాపాలు చేపట్టడం… మరో చర్చ. 2014 జూన్ 2 న తెలంగాణ అవతరణ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్తబ్దంగా ఉన్నదో ఆ పార్టీ నాయకుల వద్ద జవాబు లేదు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి పర్యటనలకు చాలా ఆలస్యంగా శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగదని, మరికొన్ని పార్టీలను కలుపుకొని వెడుతుందని కేసీఆర్ కు ముందే ‘ఉప్పందింది’. అటు కోదండరాం పార్టీ నిర్మాణ దశలో ఉన్నది. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కేసీఆర్ కు సంపూర్ణ అవగాహన ఉన్నది. 2004 లో కాంగ్రెస్ తో, 2009 లో తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు సీట్ల సర్దుబాటు ఎంత క్లిష్టమైనదో ఆయనకు తెలుసు. కనుక ఈ సర్దుబాట్లు, చర్చలు, సమావేశాలు ఒక కొలిక్కి రాక మునుపే అనూహ్యంగా ‘ముందస్తు’ బాంబు పేల్చారు. దీంతో ప్రతిపక్షాలు కకావికలమైనవి. 105 మంది అభ్యర్థుల ప్రకటన మరో బాంబు. దెబ్బ మీద దెబ్బలా కేసీఆర్ జరుపుతున్న ‘వ్యూహాత్మక దాడుల’ను తిప్పిగొట్టే సామర్ధ్యం ప్రతిపక్షాలకు లేదు. లేదా ప్రజల్లో ఉన్న అనుమానాల ప్రకారం కొందరు కాంగ్రెస్ ప్రముఖులే ‘లొంగిపోయారా’? తెలియదు. కేసీఆర్ ను ఓడించడమనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, జనసమితి, తెలుగుదేశం, సిపిఐల మధ్య ‘ఒడంబడిక’ జరగవలసి ఉన్నది. ఈ ఒడంబడిక కు ఇప్పుడు చివరి నిమిషంలో హడావుడి పడితే లాభమేమిటి? ఇంతకాలం ఏమి చేశారు? ”కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన”కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు ఎందుకు ప్రయత్నించలేదు.

ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు ‘పెద్దన్న’ కాంగ్రెస్ ఎందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను ‘రాజకీయ శక్తి’ గా మలిచేందుకు గట్టి ప్రయత్నాలు జరిపి ఉంటె, ఆ సంకల్పంలో నిజాయితీ ఉంటె ఈ అవస్థలు ఉండేవి కావు. ఇప్పటికే ‘కేసీఆర్ వ్యతిరేక ఐక్య సంఘటన’ కు పునాదులు బలంగా పడి ఉండేవి. కూటమి నిర్మాణంలో అవరోధాలు ఉండేవి కాదు. ఎన్నికలు సమీపించినప్పుడు ఇలాంటి ‘కూటమి’ నిర్మాణానికి పూనుకుంటే ఈ గొడవలు తప్పవు. తెలంగాణా జన సమితి ఏర్పడినప్పుడే కాంగ్రెస్ తదితర రాజకీయ సంస్థలు, వ్యక్తులతో కోదండరాం ‘ఐక్య సంఘటన’పై సంభాషించారా? అటువంటి ప్రయత్నానికి అడ్డంకులు ఏమి ఏర్పడినవి? కోదండరాం కోరుతున్న సీట్ల సంఖ్యను బట్టి ఆయన కూడా మిగతా రాజకీయపార్టీల నాయకుని వలె కనిపిస్తున్నారు. కోదండరాం తెలంగాణ రాజకీయాల్లో ‘ప్రత్యేక నాయకుడు’ గా అభిమానించే వారికి ఇది నిరాశ కలిగించే అంశం. సీట్ల సర్దుబాటులో తమ డిమాండ్ నెరవేరే సూచనలు కనుచూపు మేరలో లేనందున కోదండరాం బిజెపి వైపు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ”టిఆర్ఎస్ b టీమ్” గా అపనిందలకు గురవుతున్న బిజెపితో ఆయన చేతులు కలిపితే ప్రజలకు, ముఖ్యంగా తనను నమ్ముకున్న ‘తెలంగాణ వాదుల’కు కోదండరాం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు.

కోదండరామ్ ప్రయత్నాలు ఫలిస్తాయా? కాంగ్రెస్ ను కాదని వెళితే ఓట్లు- సీట్లు సాధించగలరా? కేసీఆర్ ను ఢీకొట్టాలన్న ఆయన లక్ష్యం సాధ్యమవుతుందా?”తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేలా ఉమ్మడి ఎజెండా ఉండాలి. ఎజెండా అమలు కమిటీ ఏర్పాటుచేసి దానికి కోదండరామ్ ను ఛైర్మన్ గా నియమించాలి” అని కాంగ్రెస్ పార్టీ ముందు తెలంగాణా జన సమితి ఒక ప్రతిపాదన ఉంచింది. సీట్ల విషయంలోనూ కొన్ని స్థానాలపై ఆ పార్టీ పట్టుబడుతోంది. దీంతో ‘కూటమి’లో టీజేఎస్ ను చేర్చుకోవాలా వద్దా అన్నదానిపై కాంగ్రెస్ ఆలోచనలో పడింది. టీజేఎస్ అడుగుతున్నకొన్ని సీట్లలో కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ త్యాగం చేస్తే, భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ వెనక్కు తగ్గుతున్నది? కూటమిలో ఉన్నా, లేక పోయినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని టిజెఎస్ నాయకులు చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కలిసి వచ్చే అన్ని వర్గాలు, పార్టీలను ఆహ్వానించి మరో కూటమిని ఏర్పాటు చేయాలని కోదండరాం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసి, కేసీఆర్ దెబ్బకు అనామకులుగా మారిపోయిన వారందరిని చేరదీయాలని టిజెఎస్ చూస్తోంది. చెరకు సుధాకర్ ‘ఇంటి పార్టీ’, జిట్టాబాలకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన’ యువతెలంగాణ’ పార్టీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం.కాంగ్రెస్ నాయకత్వంలో ‘మహాకూటమి’ ఏర్పడితే ప్రధాన పోరు టిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కూటమికి మధ్య కేంద్రీకృతమవుతుంది.కోదండరాం ఈ కూటమిలో చేరకుండా సొంతంగా మరో ‘చిన్నతరహా కూటమి’ ని ఏర్పాటు చేస్తే సమీకరణలు మారనున్నవి. టిఆర్ఎస్, కాంగ్రెస్, కోదండరాం కూటములు, అటు సిపిఎం బహుజన కూటములతో బహుముఖ పోటీ అనివార్యం కావచ్చు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక వచ్చి ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి.