డిసెంబర్ 11 వరకు వైన్ షాపులు బంద్ చేయండి. – రాములు నాయక్:

ఒక్కో నియోజకవర్గానికి రూ.25 కోట్ల సొమ్ము!!

హైదరాబాద్:

ఎన్నికలు పూర్తయ్యే డిసెంబర్ 11 వరకు ‘తెలంగాణ’లో వైన్ షాపులు బంద్ చేయాలని ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆయన ఆరోపించారు. మద్యం, డబ్బుతో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. విరివిగా మద్యం పంపిణీ చేస్తూ టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగించి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రాములు నాయక్ ఆరోపించారు. నీతికి, అవినీతికి.. కుటుంబ పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన ఆయన, కేసీఆర్ కుటుంబం అవినీతి సొమ్ముతో ఓటర్లను కొని ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నట్టు చెప్పారు.107 నియోజవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు రూ.5 కోట్ల చొప్పున అందజేశారని రాములు నాయక్ ఆరోపించారు. అభ్యర్థులపైనే కాకుండా వారి బంధువులపైనా ఎన్నికల సంఘం నిఘా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఓ అభ్యర్థికి రూ.7 కోట్లు ఇచ్చినట్టు తన దగ్గర పక్కా సమాచారం ఉన్నట్టు రాములు నాయక్ తెలిపారు. నామినేషన్ ముందు మరో రూ.7 కోట్లు, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మరో రూ.11 కోట్లు ఇవ్వనున్నట్టు నాయక్ చెప్పారు. ప్రతి అభ్యర్థికి రూ.25 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. డబ్బు పంచేందుకు టీఆర్ఎస్ టీమ్ లను పెట్టిందని.. తక్షణమే ఎన్నికల సంఘం అభ్యర్థులపై నిఘా పెంచేందుకు నియోజికవర్గాల్లో అబ్జర్వర్లను పెట్టాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.