బెంగాల్ పేరు మార్పుకు కేంద్రం నో!!

న్యూఢిల్లీ:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పేరు మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రాష్ట్రం పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్రం తెలిపింది. హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై బుధవారం స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రం అక్షర క్రమంలో కూడా చివర ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా కూడా బెంగాల్ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారనేది ఆమె వాదనగా తెలుస్తోంది.

ఈ పేరు మార్చాలన్న ప్రతిపాదన 2016లోనే పుట్టుకొచ్చింది. మూడు భాషల్లో మూడు పేర్లను మమత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. బెంగాలీలో ‘బంగ్లా’, ఆంగ్లంలో ‘బెంగాల్’, హిందీలో ‘బంగల్’ అనే పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్రం ఒక్క పేరునే సూచించాలని మమత ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో 2018, జులై 26న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ అనే పేరును ‘బంగ్లా’గా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. ఈ ప్రతిపాదనను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ పేరు మార్చడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.