మావోయిస్టు పార్టీ సభ్యుడు నేరస్తుడు కాదు!

N.Venugopal:

మావోయిస్టు రాజకీయాలను నమ్మినా, మావోయిస్టు పార్టీ సభ్యుడుగా ఉన్నా నేరం కాజాలదని ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలిపారు. అక్రమ కేసులతో జైళ్ళలో మగ్గుతున్న విప్లవ రచయిత, కవి వరవరరావు ప్రొఫెసర్ సాయిబాబా తో సహా అనేక మంది ప్రజాస్వామికవాదులను హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం, ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ధర్నాలో మాట్లాడుతూ ʹʹ40 ఏళ్ళుగా అఙాతంలో ఉన్న కేరళకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మురళిధరన్ 2015లో పూణేలో అరెస్టు అయ్యాడు. ఆయనకు పూణే కోర్టులో బెయిల్ రాలేదు. ఆ తర్వాత బోంబే హైకోర్టుకు వెళ్ళారు. ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోంబే హైకోర్టు ఇప్పటి వరకు ఈయనకు బెయిల్ ఇవ్వకపోవడం తప్పని, కాబట్టి వెంటనే బెయిల్ మంజూరు చేస్తున్నాం అని చెప్పింది. ఆ తర్వాత మహా రాష్ట్ర పోలీసులు బోంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళారు. దీనిపై 15 రోజుల కింద సుప్రీంకోర్టు బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని తేల్చి చెప్పింది. విశ్వాసాల వల్ల ఎవరినీనిర్భంధించ కూడదని, విశ్వాసాల వల్ల ఎవరిపైనా నేరం ఆపాదించకూడదని తేల్చి చెప్పిందిʹʹ అన్నారు.