ప్రజా ఉద్యమంగా మిషన్ కాకతీయ సాగాలి – హరీష్‌రావు.
మీడియా అవార్డుల ప్రదానం, ఏఈఈలకు నియామక ఉత్తర్వులు అందించిన తర్వాత మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. ప్రజా ఉద్యమంగా మిషన్ కాకతీయ సాగాలన్నారు. ప్రభుత్వ పథకాలను మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎంత ఎత్తుకు లిఫ్ట్ చేశాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత మంది రైతులకు నీళ్లు ఇచ్చామన్నది ముఖ్యమని హరీష్‌రావు చెప్పారు. 12 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణ చేశామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఇరిగేషన్ శాఖలో 686 మంది ఇంజినీర్లను నియామకం చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ కాకతీయ మూడోవిడుత (2017) మీడియా అవార్డులను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ అందజేశారు. ప్రింట్ అండ్ ఫొటో విభాగంలో నమస్తే తెలంగాణకు నాలుగు అవార్డులు దక్కాయి. అవార్డు విజేతలకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ప్రథమ బహుమతి కింద రూ.లక్ష, రెండో బహుమతికి రూ.75 వేలు, మూడో బహుమతికి రూ.50 వేలు, స్పెషల్ జ్యూరీ బహుమతిగా రూ.25 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ టుడే డిప్యూటీ ఎడిటర్ బాలకోటేశ్వర్రావు, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. మీడియా అవార్డుల ప్రదానం అనంతరం సాగునీటిశాఖలో కొత్తగా నియామకమైన 300 మంది ఏఈఈలకు మంత్రి హరీశ్‌రావు నియామక ఉత్తర్వులను అందజేశారు.
ప్రింట్మీడియా విభాగంలో మొదటి బహుమతి నోముల రవీందర్‌రెడ్డి (ఆంధ్రజ్యోతి), రెండో బహుమతి ఎక్కల్దేవి శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ), మూడో బహుమతి కే మల్లికార్జున్‌రెడ్డి (సాక్షి) అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డులు.. పీ శ్రీనివాస్ (తెలంగాణ టుడే), చిన్నారెడ్డి (నమస్తే తెలంగాణ), ఫొటో జర్నలిస్టుల విభాగంలో గొట్టె వెంకన్న (నమస్తే తెలంగాణ), రజనీకాంత్గౌడ్ (నమస్తే తెలంగాణ) అవార్డులను అందుకున్నారు.ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో మొదటి బహుమతి కే శ్రీశైలం (ఈటీవీ), రెండో బహుమతి బీ గురుప్రసాద్ (టీవీ1), మూడో బహుమతి కే విక్రమ్‌రెడ్డి (సాక్షి టీవీ), వీడియో జర్నలిస్టుల విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు డీ సూర్యనారాయణ (ఈటీవీ), అంజి (టీవీ1), శ్రీరాములు గౌడ్ (దూరదర్శన్ యాదగిరి) అందుకున్నారు.