ఎయిరిండియా డీల్స్ పై ఈడీ కేసులు.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త కష్టం వచ్చి పడింది. యుపిఏ హయాంలో జరిగిన వివాదాస్పద ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ విలీనం సహా కనీసం నాలుగు ఒప్పందాల్లో ‘మనీ లాండరింగ్’, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఇందుకోసం మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పోలీస్ ఎఫ్ఐఆర్ తో సమానంగా భావించే ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఈసీఐఆర్) కనీసం నాలుగు దాఖలు చేసింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులకు సంబంధించిన పలు పత్రాలను ఎయిర్ లైన్స్, ఇతర శాఖల నుంచి సంపాదించినట్టు ఈడీ తెలిపింది. నల్లధనం సంపాదించేందుకు అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే ప్రత్యేక కోణంలో దర్యాప్తు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలా మనీ లాండరింగ్ ద్వారా సంపాదించిన నల్లధనంతో నిందితులు అక్రమాస్తులు కూడబెట్టారా అనే విషయాన్ని పరిశోధించనున్నట్టు చెప్పారు. నాలుగు సీబీఐ ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ ఈ కేసులు నమోదు చేసింది.ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ వివాదాస్పద విలీనంపై రెండు కేసులు పెట్టారు. యుపిఏ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రెండు ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో విమానాల కొనుగోళ్లు, అద్దెకివ్వడం ద్వారా ఖజానాకు భారీ నష్టం సంభవించిందని సీబీఐ ఆరోపించింది. లాభదాయక రూట్లు, సమయాలను జాతీయ, అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వరంగంలోని ఎయిరిండియాకు ఎనలేని నష్టం వాటిల్లిందని మరో రెండు కేసులు పెట్టారు. త్వరలోనే కొందరు అధికారులు, సిబ్బందికి ఈడీ సమన్లు జారీ చేయవవచ్చని భావిస్తున్నారు.