ఎన్డీఏ నేతగా ఎన్నికైన మోడీ

ఎన్డీఏ నేతగా ఎన్నికైన మోడీ

కొత్తగా ఎన్నికైన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఎంపీలు శనివారం సాయంత్రం 6 గంటలకు పార్లమెంటులోని సెంట్రల్ హాల్ లో సమావేశమయ్యారు. వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. శిరోమణి అకాలీదళ్ కి చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును ప్రతిపాదించారు. జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీష్ కుమార్, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే దీనిని బలపరిచినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.


కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ మోడీ, ఆయన ప్రభుత్వం తమ రాజీనామాలు సమర్పించడంతో శనివారం ఉదయం రాష్ట్రపతి కోవింద్ 16వ లోక్ సభను రద్దు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా లోక్ సభకు ఎన్నికైన 542 మంది సభ్యుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించింది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ ప్రారంభించడం మొదలైంది.


ప్రధాని ఇవాళ మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేవచ్చని అనధికార వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.