మునిసిపల్ కొత్త చట్టానికి ఆమోదం

తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ)-2019 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకువస్తున్నాం. ఇది సభ్యులకు, ప్రజలకు తెలుసు. పదిగా ఉన్న జిల్లాలను 33 జిల్లాలను చేశాం. అనేక విభాగాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. 5వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 65 మున్సిపాలిటీల ఉండే. ఇప్పుడు 142 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలన్నా.. శాసనసభ ఆమోదించాల్సిందే. ప్రగతి నిరోధక శక్తులు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయి. ల్యాండ్ మాఫియా విజృంభించి దుష్ట కార్యక్రమాలకు తెరలేపారు. అభివృద్ధి క్రమపద్ధతిలో జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువస్తున్నాం. పురపాలక ఎన్నికలు జరపాలనే సంకల్పంతోనే ఈ బిల్లును తీసుకువస్తున్నాం. త్వరలోనే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ. 2 వేల 74 కోట్లు ఇస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.