“None Of The Above” అధికారపార్టీకి దడ.

విశ్వనాథ్, కరీంనగర్;
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు, ముఖ్యంగా అధికార పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడింది. నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి నిరసనగా ‘నోటా’ ను ప్రయోగించాలని కొందరు ‘ప్రముఖులు’ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ‘నోటా’ అంటే “None Of The Above” అని అర్ధం. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ తనకు ఇష్టం లేదని ఓటరు చెప్పాలనుకుంటే, ‘నోటా’ ద్వారా తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గత ఎన్నికల నుంచి ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నది. 2014 లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటులో ‘నోటా’కు 1657 ఓట్లు పోలైనవి. ఈ సారి టిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ సహా ఇతర అభ్యర్థులకు వ్యతిరేకంగా కరీంనగర్ నియోజకవర్గంలో ‘నోటా’ కోసం ఇప్పటికే పదివేలకు పైగా ‘ఓటు బ్యాంకు’ సిద్ధం చేసినట్టు సమాచారం అందింది. “నోటా” ప్రచారానికి తెర వెనుక ‘కొందరు వ్యక్తులు’ చాలా వేగంగా పావులుకదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇది నిజమైతే కరీంనగర్ లోనే కాకుండా రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం చోటు చేసుకోనుంది. సాధారణంగా ఏ పార్టీ అయినా తమ అభ్యర్థులకే ఓటెయ్యాలిఅంటూ ప్రచారం చేయడం సహజం. అలా ఏ పార్టీకా పార్టీ ప్రచారం చేసుకోవడం ప్రతి ఎన్నికల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ‘నోటా’ను గెలిపించాలంటూ కొందరు చేస్తున్న ప్రచారం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థుల పైన ఉన్న అసంతృప్తి వల్లే ‘నోటా’ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం మొదలైంది.

కరీంనగర్ జిల్లాలో నోటాకుఓటేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం హడలెత్తిస్తోంది. . నోటా.. ‘నన్ ఆఫ్ ద ఎబో’… కరీంనగర్ నియోజకవర్గంలో ‘నోటా’పై సోషల్ మీడియాలో చర్చ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈసారి కరీంనగర్ లో పార్టీ అభ్యర్థులకు బదులు ‘నోటా’ను గెలిపిద్దామంటూ కొందరు యువకులు ప్రచారం మొదలెట్టారు. కరీంనగర్ లో అధికార పార్టీ అభ్యర్థిగా గంగుల కమలాకర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేరు వినిపిస్తోంది. బిజెపి నుంచి బండి సంజయ్ బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఓ వైపు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే, ముగ్గురు ప్రధాన అభ్యర్థులను వ్యతిరేకించే విధంగా కొందరు యువత ”ఈసారి నోటానుగెలిపిద్దా”మంటూ ప్రచారం చేస్తుండడం విశేషం. ‘నోటా’ రూపంలో ఎవరి కొంప మునుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లను నోటావైపు మళ్ళించడం సాధ్యపడుతుందాఅన్నది సందేహమే. కానీ ‘నోటా’ వైపు పెద్ద ఎత్తున ఓట్లను మళ్ళించడం వల్ల అది ఏ అభ్యర్థి ఓట్ బ్యాంకును దెబ్బతీస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల గుండెల్లో ‘నోటా’ రైళ్లు పరుగెడుతున్నవి.’నోటా’ వల్ల నష్టం వాటిల్లవచ్చునని ప్రధాన రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నవి.