ప్రగతి భవన్ లో పార్టీ సమావేశాలపై నోటీసులు!!

హైదరాబాద్:

ప్రగతి భవన్ లో రాజకీయ సమావేశాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. దానికి ఇంకా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. నోటీసులు అందినవాళ్లు తిరిగి సమాధానం ఇస్తారని.. జవాబు ఇవ్వనివారి వివరాలను ఈసీఐకి పంపితే ఎలక్షన్ కమిషన్ విచారణ జరుపుతుందని రజత్ కుమార్ వివరించారు. 1950 నుంచి వాడుతున్న పింక్ బ్యాలెట్ పేపర్లపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని.. రంగు మార్పుపై న్యాయ కోవిదుల అభిప్రాయం తీసుకుంటామన్నారు.సెక్షన్ 127కి సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చినట్టు రజత్ కుమార్ చెప్పారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో బహిరంగ సభలను అడ్డుకొన్న వారిపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదని ఎన్నికల అధికారి సూచించారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఇరు రాష్ట్రాల డీజీపీలకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. సభలకు వచ్చేవారికి పార్టీలు డబ్బు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై 171 (బీ) ప్రకారం చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు సంబంధించి డీజీపీ ఇచ్చిన నివేదిక ప్రకారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. సుమారు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగవచ్చన్నారు. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి అవకాశం ఉంటుందన్నారు