ఎన్ కౌంటర్ భయంతో 12 వేల మంది లొంగుబాటు!!

ఎన్ కౌంటర్ భయంతో
12 వేల మంది లొంగుబాటు!!

– రత్నకుమార్.ఎం.డి.

యూపీలో ఎన్ కౌంటర్ భయంతో 12వేలకు పైగా నేరగాళ్లు..పోలీసు స్టేషన్లకు వచ్చి లొంగిపోయారట! ఇది నిజమేనా? రాజకీయ నాయకత్వం చొరవ , సంకల్పం సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇన్నాళ్ళూ అక్కడ పోలీసు వ్యవస్థ నడుస్తూనే ఉందిగా! ఆ నేరగాళ్లు తమ పనిని నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నారుగా! అంటే దానర్థం ఏమిటి? పోలీసు వ్యవస్థ ఇన్నాళ్ళూ కళ్ళులేని కబోదిలా ఉడిపోయిందనేగా! సదరు నేరగాళ్ళతో పోలీసులు చెట్టాపట్టాలేసుకుని జాయింటుగా పనిచేసుకుంటున్నారనేగా! ఏదో రాజకీయ నాయకత్వం తలుచుకోబట్టి(కారణాలేవైనా కావొచ్చు. వ్యవస్థకు సవాలుగా నిల్చేరీతిలో నేరగాళ్లు భాజపా నీడలో ఎక్కడా లేరని చెప్పలేం) ఈ నేరగాళ్ళంతా ప్రాణభయాన్ని ఎదుర్కొని లొంగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే రాజకీయ బాసులు చెప్పకపోతే యూపీ పోలీసులు.. సదరు నేరగాళ్ళపై కన్నెర్ర చేయగలిగిఉండేవారే కాదు. యథాప్రకారం వారి మధ్య దోస్తీ కొనసాగేది. వాళ్ళు ప్రజలనుంచి దోచుకొచ్చిన పాపపు సొమ్మూ రక్తపు కూడులో తమ వాటా తీసుకుని హాయిగా పెళ్ళాం పిల్లలతో ఆరగించిఉండేవారు కాదా! పోలీసుల అండదండల్లేకుండా ఇన్నాళ్ళూ తమ నేరసామ్రాజ్యాన్ని సదరు నేరగాళ్ళు కొనసాగించి ఉండగలిగేవారా? అప్పుడే ఆ నేరగాళ్ళందర్నీ ఎందుకు అదుపుచేయలేకపోయారు? పైనుంచి ఆదేశాలొస్తేనే నేరాల్నీ నేరగాళ్ళనూ అదుపుచేయటానికి చేతులొస్తాయా? ఇన్నాళ్ళూ చేతులు కట్టేసుకున్నది కాసులకోసమా? ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నాయా? ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులు తెలంగాణలో నయీం ఉదంతాన్ని గుర్తుచేస్తున్నాయి. నయీం ఏళ్ళతరబడి తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంటే పోలీసులు చోద్యం చూశారు. కానిస్టేబుల్ నుంచి అత్యంత సీనియర్ ఐపీఎస్ ల దాకా అతగాడి లబ్దిదారులే. అతడిని అడ్డు పెట్టుకుని కోట్లు పోగేసుకున్నవారే. చివరికేమైంది? అతగాడి చేష్టలు సాక్షాత్తూ ప్రభుత్వాధినేత సన్నిహితుల్నే ఇబ్బంది పెట్టడంతో ఇక ‘ఫైనల్ కాల్’ కు తెరలేచింది. పకడ్బందీగా ఎన్ కౌంటర్ జరిగిపోయింది. అంటే నేరస్థుల ఉనికితో రాజకీయ బాసులకు సెగ తగిలిన తర్వాతే పోలీసులకు కర్తవ్య బోధన జరిగింది. పాపం నయీం! యూపీలో తన 12వేలమంది సోదరుల్లో ఒక్కడినుంచి ‘స్ఫూర్తి’ పొందినా ..అతగాడు తన ప్రాణాల్ని నిలబెట్టుకునేవాడేమో! అయితే అతడు నోరుతెరిస్తే తమ బతుకులు తెల్లారిపోతాయి కాబట్టి..అతగాడి ప్రయత్నాన్ని పోలీసులు నెరవేరకుండా చేసిఉండేవారు. నేరాన్ని నేరంగా చూసి అరికట్టే విధానం ఈ దేశంలో పోలీసులు ఎప్పటికి నేర్చుకుంటారు? వేరే అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లోని వ్యవస్థల తీరుతెన్నులను పరిశీలన చేసి పాఠాలు నేర్చుకుంటే మంచిదేమో!