‘హంత‌క రాజ్యం’లో చింత‌నాప‌రులు.

‘హంత‌క రాజ్యం’లో చింత‌నాప‌రులు.

డి. ఉద‌య‌భాను:

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట దేశవ్యాప్తంగా కల్బుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరీలంకేశ్‌ వంటి ప్రగతిశీల మేధావులను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టింది. అధికార కాలం చివరి అంకంలోకి చేరుకున్నాక వ్యూహాత్మకంగా హత్యలను ఆపి, మేధావులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో బంధించే పనికి పూనుకున్నది. బ్రాహ్మణీయ హిందూ మతోన్మాద మంద్రస్థాయి యుద్ధాన్ని చాకచక్యంగా అమలు చేసుకుంటూ పోతున్నది.రోనావిల్సన్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూని వర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థి. సురేంద్ర గాడ్లింగ్‌ మానవహక్కుల కార్యకర్త, ప్రజలపక్షాన పోరాడుతున్న న్యాయవాది. ఈయనే జీ.ఎన్‌.సాయిబాబా కేసును వాదిస్తున్నారు. షోమాసేన్‌ నాగ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌, ఇంగ్లీష్‌ లిటరేచర్‌ డిపార్ట్‌మెంట్‌ శాఖాధ్యక్షురాలు. సుధీర్‌ దావలే దళిత ఉద్యమ నాయకుడు, హక్కుల కార్యకర్త. మహేశ్‌ రావత్‌ ప్రధానమంత్రి ఆదివాసీ సేవాపథకంలో పనిచేస్తున్న నాయకుడు. వరవరరావు తెలుగు ప్రజలకు పరిచయావసరం లేని ప్రజాకవి. భిన్న ప్రాంతాలకు చెందిన వీళ్లంతా చేస్తున్న పని మాత్రం ఒక్కటే. భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరిట అమలవుతున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, ప్రత్యా మ్నాయంగా, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడం కోసం పోరాడుతున్నవాళ్లు. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 19 ప్రకారం మనుషులందరికీ కల్పించిన హక్కులకోసం నిరంతరం మాట ద్వారా, రాత ద్వారా ఉద్యమిస్తున్నవాళ్లు. స్థూలంగా స్వేచ్ఛా మానవ సమాజాన్ని కాంక్షిస్తున్నవాళ్లు. హిందూ మతోన్మాదానికే కాదు, ఏ మతోన్మాదానికైనా ప్రజాస్వామిక వ్యవస్థ గిట్టదు. నిజమైన అర్థంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవాళ్లంటే నచ్చదు. అందుకే వారిని నిర్మూలించే కార్యక్రమం చేపడుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అదే చేసింది. పైన పేర్కొన్న మేధావులంతా కలిసి, ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ, ఒక హిందీ ఉత్తరం, రెండు ఇంగ్లీష్‌ ఉత్తరాలను సృష్టించింది. స్వయంగా మాజీ డీజీపీ, మాజీ సుప్రీంకోర్టు న్యాయవాదులు, మాజీ హైకోర్టు న్యాయవాదులు, పత్రికా సంపాదకులు, మేధావులు ఈ ఉత్తరాలు పోలీసుల సృష్టే అన్నారు. దాంతో బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రజల్లో అభాసుపాలయ్యారు. వ్యూహాత్మకంగా కొంత వెనక్కి తగ్గారు. మూడు నెలల కాలం ఆగారు. ప్రజలు తాము కల్పించిన కట్టుకథను మర్చిపోయారని అర్థం చేసుకున్నాక మళ్లీ అవే కల్పిత లేఖల ఆధారాలను చూపుతూ అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు.ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చాక హంతక రాజ్యం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక ఉపశమన రక్షణ కవచంగా దళితులకు అది పనికివచ్చింది. కానీ దాన్ని బీజేపీ మొదట నిర్వీర్యం చేసి, ఆ తర్వాత పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేసింది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యింది. నిర్మాణాత్మకత లేని ప్రజా ఉద్యమం పాలపొంగులా చల్లారుతుంది. కానీ మేధావులు తమ అభిప్రాయాలను నిరంతరం వ్యక్తం చేస్తూనే ఉంటారు. పాలకుల కుట్రల్ని బహిర్గతం చేస్తూనే ఉంటారు. వరవరరావు తదితరులు అదే చేశారు. బీజేపీకి అది నచ్చలేదు. మరోవైపు భీమా కోరేగావ్‌లో దళితుల ధీరోదాత్త త్యాగాన్ని ఎత్తిపడుతూ వేలాదిమంది ర్యాలీ చేశారు. బ్రాహ్మణీయ పీష్వాల పాలనకు ఎదురు నిలిచి పోరాడిన తమ పూర్వీకుల త్యాగాలను, ధైర్యాన్ని వర్తమాన ఉద్యమానికి తర్జుమా చేశారు. దాంతో దళితోద్యమ నాయకులు బీజేపీకి కంటగింపుగా మారారు. ఈ నేపథ్యంలోనే వరవరరావు, ఇతర ప్రగతిశీల, దళిత ఉద్యమకారుల మీద కుట్రపూరితమైన ఆరోపణలు, అరెస్టులు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో కేంద్రంగా వేరువేరు ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న భవాని, అన్నపూర్ణ, అనూషలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో వీరికి సంబంధం ఉందని విశాఖపట్నం పోలీసుల ఆరోపణ. నిజానికి భవాని అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలు. అన్నపూర్ణ, అనూషలు చైతన్య మహిళా సంఘం సభ్యురాళ్లు. వీరి తండ్రి తెలంగాణ ప్రజాఫ్రంట్‌ సభ్యుడు. ఈ సంఘాలన్నీ కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజాసంఘాలు తప్ప ఏ దేశద్రోహానికీ పాల్పడ్డవి కావు.బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందూత్వ శక్తులకు చాలా బలం వచ్చింది. కులనిర్మూలనకు ఒక మార్గమైన కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లను యధేచ్చగా, అందరిముందే నరికి చంపుతున్నారు. హతుల్లో తొంభైతొమ్మిది శాతం దళితులు, వెనుకబడిన తరగతులవాళ్లే. హంతకులకు బాసటగా నిలిచేది స్థానిక పాలకులే అయినప్పటికీ వారికి మనోధైర్యం ఇస్తున్నది మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే.
మొత్తంగా దేశవ్యాప్తంగా మంద్రస్థాయి యుద్ధం తారాస్థాయికి చేరినట్లు అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఆపరేషన్‌ గ్రీనహంట్‌ పేరిట ఆదీవాసీలను చంపి వేలకోట్ల రూపాయల విలువచేసే సహజ వనరుల్ని కొల్లగొడుతున్న స్థితి. మరోవైపు దళితుల, ముస్లింల హత్యలు. ఇంకోవైపు ప్రజాసంఘాల సభ్యుల, ప్రగతిశీల మేధావుల, దళిత ఉద్యమకారుల అక్రమ అరెస్టులు. తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే, తమ కుట్రల్ని ప్రజలకు అర్థం చేయించే, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించే మేధావులు, ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, ప్రొఫెసర్లు, ప్రజా న్యాయవాదులు, జర్నలిస్టులను వదిలి పెట్టకుండా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టాలనే వ్యహం బీజేపీది.బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు బీజేపీ తమ శత్రువులెవరో సరిగ్గానే గుర్తించి తనపని తాను చేసుకు పోతున్నది. మిగిలింది మనమే!