ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకులు.

హైదరాబాద్ :

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ల సర్వీస్ క్రమబద్ధీకరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ ఆదేశాలతో 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నాలుగు విద్యుత్ సంస్థలు గత ఏడాది ఆదేశాలు జారీ చేశాయి. విద్యుత్ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్‌లలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది.

హైకోర్టు నిర్ణయంపై సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంగళవారం పండుగ రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావును అభినందించారు. 23 వేల మంది ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించి వేతన సవరణ అమలు చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.