వైరల్ అవుతున్న ‘పందెం పుంజు’ పోస్ట్!

వైరల్ అవుతున్న ‘పందెం పుంజు’ పోస్ట్!

ఓడిపోతే నా గతి ఇంతేనా..?

pandem punju viral post

నన్ను మహరాజులా పెంచావు. నీ కన్న బిడ్డలకంటే నన్ను అల్లారు ముద్దుగా పెంచావు. గోరువెచ్చటి నీళ్లతో రోజూ స్నానం చేయించావు. వేసవి వచ్చిందంటే శీతల గదులలో ఉంచావు. బాదం, పిస్తావంటి పౌష్టికాహారం అందజేశావు. కాస్తంత నలత చేస్తే వైద్యం చేయించావు. నాకు పెట్టగాలి సైతం సోకకుండా..మగతనం నిర్వీర్యం కాకుండా ధీరోత్తంగా తయారు చేశావు. సంక్రాంతి రానే వచ్చింది. యుద్ధభూమికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. గెలుపో.. ఓటమో.. వీరోచితంగా పోరాడాలని నిర్ణయించుకున్నా. నా ప్రాణంకంటే నా యజమాని పౌరుషమే నాకు ముఖ్య మనిపించింది. అనట్టుగానే బరిలో దిగాను. ప్రత్యర్థి పుంజును చిత్తుగా ఓడించాను. రెడ్డి గారు పెంచిన పుంజు సైతం తక్కువదేమీ కాదు. నాకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పటికే మూడు రోజులుగా అరడజను పందాలు గెలుపొంది ఒంటి నిండా గాయాలైనప్పటికీ నేను చివరి వరకూ పౌరుషానికే నిలిచాను. నాకు ప్రాణం పోతుందని తెలుస్తూనే ఉంది. అయినా నాకు గర్వంగానే ఉంది. ఎందుకంటే గెలిచి, చచ్చినా నా యజమాని పౌరుషం నిలపడంకంటే ఆనందమేముంది ?దొరా.. నాకు ప్రాణం పోతున్నట్లు తెలుస్తోంది. ఆత్మ గాలిలోకి వెళ్లిపోతోంది. నా గురించి మీ మిత్రులతో నాలుగు మంచి మాటలు చెపుతావని ఆశించాను. నీవు మాట్లాడుతున్న మాటలు నా చెవిన పడి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. నిర్జీవ స్థితిలో కనిపిస్తున్న నన్ను మీ పాలిగానికి చూపిస్తూ.. ఒరేయ్‌ ఇది చచ్చింది. తీసుకుపోయి దోరగా కాల్చు. చిన్న చిన్న ముక్కలుగా తరిగించి అమ్మగారికి ఇవ్వు. కొంత మాంసం చికెన్‌ ఆవకాయ పట్టించు…మా పెద్దదానికి మహాఇష్టం.. అమెరికా నుంచి మొన్ననే వచ్చింది.. వెళ్ళేటప్పుడు తీసుకెళుతుంది. మిగిలిన మాంసంలో కొంత కూర, కొంత ఫ్రై చేయిస్తే ఇంటిల్లి పాదికీ సరిపోతుందని నువ్వు మీపాలెగానికి చెపుతుంటే… చావు బతుకల మధ్య ఉన్న నా ప్రాణం చివుక్కుమంది. నాబొచ్చు పీకుతున్న పాలెగాడు నాలో కదలిక చూసి ఏవండీ ఇది ఇంకా బతికే ఉంది. వైద్యం చేయిద్దామా ? అని చెబుతుంటే మీరిచ్చిన బదులు మిగిలిన నా ప్రాణాలను తోడేసింది. దీనికి వైద్యం దండగరా..! మూడేళ్ళుగా ముప్పై పందాలు పైగా పొడిచింది. ఒళ్ళు బాగా గాయాలతో పాడైంది. పైగా ముసలి దైపోయింది.. ఇది ఇంకా కోజా (మాంసం)గానే పనిచేస్తుంది. ఎక్కువ ఆలోచించక ముక్కలు కొట్టించు అని మీరు చెబుతుంటే నన్ను అల్లారు ముద్దుగా పెంచిన మీరేనా.. అని సందిగ్ధం ఏర్పడింది. రాజకీయ నాయకుల మాదిరి కాకుండా మడం తిప్పకుండా.. చివరి వరకూ ప్రత్యర్థితో పోరాడాను. నాయకులు పార్టీలు మారినట్లు.. అవకాశవాదంగా వ్యవహరించకుండా.. నువ్వు నన్ను వ్యాహ్యాళికి తోటలలోకి వదిలినప్పుడు పారిపోకుండా నిన్ను నమ్మి ఉన్నాను. బలిసిన కోడి పెట్టలు నావెంట పడినా వీరోచితంగా పోరాడాలనే తపనతోనే పెట్టల జోలికి పోకుండా బ్రహ్మచర్యం పాటించాను. నన్ను నాలుగైదు పర్యాయాలు మీ మానవజాతి దొంగలు ఎత్తుకెళ్లినా నా గూటిని వెతుక్కుంటూ వచ్చేశాను. ఇదేనా నీ రుణం తీర్చుకోవడం అంటే.. నా మాంసాన్ని ఆవకాయ పెట్టించి అమెరికా పంపిస్తున్నావు. పొగలు సెగలు కక్కే కూర వండించి ఇంటిల్ల పాదికీ వడ్డిస్తున్నావు..దొరా..! చచ్చి కూడా నేనే గెలుస్తున్నాను. నాదేహం కూర, ఆవకాయల రూపంలో మీ దేహాలలో ప్రవేశిస్తే ఏదో ఒక మూల ఒక రక్తపు బొట్టుగా మీరు జీవించినంత కాలం మీలోనే నేనుంటాను. మనుషుల కుత్సిత బుద్ధిని ఇక చూడలేను. వెళ్ళొస్తాను.

ఇట్లు:

నీ వీరోచిత పుంజు..కాదు కాదు కోడి.
పాలకొల్లు.