పార్లమెంటరీ కార్యదర్శుల ‘కసరత్తు’ పూర్తి!!

పార్లమెంటరీ కార్యదర్శుల
‘కసరత్తు’ పూర్తి!!

ఎస్.కె.జకీర్.

తెలంగాణలో కనీసం 9 మందికి పైగా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు లభించనున్నట్టు తెలుస్తున్నది. మంత్రి వర్గంలో స్థానం లభించని ఎమ్మెల్యేలకు విప్ పదవులు, పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టులు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. పార్లమెంటరీ కార్యదర్శులను ‘శాసనసభకు అనుసంధానం’ చేసే వ్యవహారంపై కసరత్తు జరుగుతున్నది. ప్రభుత్వపరంగా కాకుండా అసెంబ్లీకి ‘అనుసంధానం’ చేస్తున్నందున ఆ మేరకు శాసనసభ, శాసనమండలి నిబంధనలను సవరించే చర్యలను చేపడుతున్నట్టు తెలుస్తున్నది. పార్లమెంటరీ కార్యదర్శులకు ‘కేబినెట్ హోదా’ ఉంటుందని తెలుస్తున్నది. అలాగే శాసనసభలో సంబంధిత మంత్రి అందుబాటులో లేని పక్షంలో ఆ మంత్రి తరపున సభ్యుల ప్రశ్నలకు పార్లమెంటరీ సెక్రెటరీ సమాధానం ఇవ్వవచ్చునని తెలియవచ్చింది. ఇందుకోసం అసెంబ్లీలో మంత్రుల చాంబర్ లోనే ఒక టేబుల్ ను పార్లమెంటరీ సెక్రెటరీకి ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికే అవకాశం ఉన్నది. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ లతో పాటు పార్లమెంటరీ కార్యదర్శులు, కేబినెట్ హోదా కలిగిన కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులనూ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నవి.’పార్లమెంటరీ సెక్రెటరీ’ల నియామకం చెల్లదని హైకోర్టు 2015 లో తీర్పునిచ్చింది. ఈ కేసు వేసిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆ తర్వాతా టిఆర్ఎస్ లో చేరారు.అది వేరే విషయం. సీఎం కేసీఆర్‌ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, పార్లమెంటరీ సెక్రెటరీలకు లక్షల్లో జీతాలు, అలవెన్సులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులో కేసు నడిచింది. మళ్ళీ అటువంటి పరిస్థి తలెత్తకుండా న్యాయపరమైన చిక్కులు, వివాదాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ‘లా’ డిపార్టుమెంటు కసరత్తు చేస్తున్నది. ‘పార్లమెంటరీ కార్యదర్శి’ వ్యవస్థ అమలులో ఉన్న జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో పరిస్థితులను న్యాయ శాఖ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. ఇప్పటికే ఒక నివేదిక రూపొందినట్టు సమాచారం అందుతున్నది. పార్లమెంటరీ కార్యదర్శులను పాలనా వ్యవహారాలకు ముడిపెట్టకుండా అసెంబ్లీకి అనుసంధానం చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తవని న్యాయ నిపుణులు చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఇక ఆరూరి రమేష్, రేఖా నాయక్,రామలింగా రెడ్డి, బాల్క సుమన్, దాస్యం వినయ భాస్కర్, కోనేరు కోనప్ప, ఒడితెల సతీష్ , షకీల్, గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి, పట్నం నరెందర్ రెడ్డి, వివేకానంద లలో కొందరికి ‘విప్’ లేదా పార్లమెంటరీ సెక్రటరీ పదవులు లభించవచ్చునని ప్రచారం సాగుతున్నది.