రాష్ట్రంలో సజావుగా ‘శాంతి భద్రత’.

హైదరాబాద్:

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్. ఇప్పటికే శాంతిభద్రతలు ఎన్నికల కమిషన్ అధీనంలో ఉన్నాయని.. శాంతిభద్రతల సమస్య తలెత్తిత ఎలా స్పందించాలనే దానిపై డీజీపీతో పలుమార్లు చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల బందోబస్తుకు మొత్తం 70,000 మంది రాష్ట్ర పోలీసులు ఉన్నప్పటికీ కేంద్రాన్ని 307 కంపెనీలను అడిగినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 250 కంపెనీలు ఇవ్వడానికి సంసిద్ధత తెలిపిందని రజత్ కుమర్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల నుంచి హోమ్ గార్డులను రప్పిస్తున్నట్టు చెప్పారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణ ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినందువల్ల ఆ రాష్ట్ర పోలీసులను వినియోగించడం లేదన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల తీరుపై ఏపీ డీజీపీతో మాట్లాడానని.. ఆయన వివరణ ఇంకా రాలేదని తెలిపారు.ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బలగాలు లాంగ్ మార్చ్ చేస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కు ఉపయోగించుకొనేందుకు చైతన్య పరుస్తున్నాయని చెప్పారు. లిక్కర్, డబ్బు పంపిణీపై ఇంకా నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టు రజత్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల ఖర్చుపై నిఘా పెట్టేందుకు 119 నియోజకవర్గాలకు పరిశీలకులు వస్తున్నారని.. వారికి ఎప్పటికప్పుడు ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎయిర్ అంబులెన్స్ అవసరంపై జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో ఎయిర్ అంబులెన్స్ ఏ విధంగా ఉపయోగపడిందో అధ్యయనం చేస్తున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. 171 సెక్షన్ కింద లైసెన్స్ కలిగిన వెపన్స్ స్వాధీనం చేసుకున్నామని.. కొందరు ఎమర్జెన్సీ (ఆర్మీ, బ్యాంక్ సెక్యూరిటీ) వ్యక్తుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోలేదని వివరించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ లకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.