రైతులపై కేసులు ఉపసంహరించిన పెప్సికో

ఆలుగడ్డపై రైతుల నుంచి బలంగా న్యాయపోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను కంపెనీ బేషరతుగా ఉపసంహరించుకున్నట్టు రైతుల తరఫు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ తెలిపారు. దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు.

ఒక తరహా బంగాళదుంప పేటెంట్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పెప్సికో గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కేసులు పెట్టింది. తమ లేస్ చిప్స్ కోసం ఉపయోగించే ఎఫ్ సి5 తరహా ఆలుగడ్డలకు పేటెంట్ తీసుకున్నామని, రైతులు అక్రమంగా పండిస్తున్నారని ఆరోపించింది. పెప్సీ కోలా, లేస్ చిప్స్ తయారుచేసే పెప్సీకో అమెరికాలోని హెడ్ క్వార్టర్, ఆసియా పసిఫిక్ ప్రాంతం కార్యాలయం రైతులపై చట్టపరమైన కేసు నమోదు చేసిన భారత శాఖ చర్యపై విచారం వ్యక్తం చేసింది.

పెప్సీకో కేస్ పెట్టడంపై దేశవ్యాప్తంగా ప్రజలు రైతులకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో కూడా పెప్సికో చర్యను తీవ్రంగా విమర్శించారు. చివరికి పెప్సికో వెనుకంజ వేయాల్సి వచ్చింది.