PM Express way Intro

మూడు ఉత్తరాధి రాష్ట్రాలకు వరంగా మారిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్‌ వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ పార్క్ వద్ద ఈ ఎక్స్ ప్రెస్‌ వేను ప్రధాని ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఓపెన్ టాప్ జీపుల్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున మోదీ… మోదీ… అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలకు ఈ ఎక్స్‌ ప్రెస్‌వే వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దీని నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయింది. 910 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 500 రోజుల్లోనే పూర్తి చేశారు.హర్యానాలోని కుండ్లీ నుంచి పల్వాల్ వరకు కేవలం 72 నిమిషాల్లోనే చేరుకునే విధంగా హైవేను నిర్మించారు. హైవేపై సౌర విద్యుత్తు దీపాలను అమర్చారు. ఇది సిగ్నల్ రహిత రహదారి. ఎక్స్ ప్రెస్ వే వల్ల ఢిల్లీ, నోయిడా వాసులకు ప్రయాణం చాలా సులభంగా మారింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్‌ వే ప్రారంభం తర్వాత ప్రధాని ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పట్ లో ఈస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్ ప్రేస్ వేను కూడా ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి స్మార్ట్, గ్రీన్ హైవే. 135 కిలోమీటర్ల మేర నిర్మించిన ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ వే పర్యావరణ హితంగా నిర్మించారు. కాలుష్య నియంత్రణలో ఇదో కీలక మైలురాయిగా ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వేకు ప్రధాని మోదీ 2015 నవంబర్ లో శంకుస్థాపన చేశారు. ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంతో దేశ రాజధానిలో కాలుష్యం తగ్గనుంది. రోజు జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లే 50 వేల వాహనాలను ఈ ఎక్స్ ప్రెస్ వే గుండా దారిమళ్లించవచ్చు. ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 125 కోట్ల ప్రజల జీవన విధానాన్ని పెంపొందించడంలో ఆధునిక మౌళిక వసతులు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. మౌళిక వసతులను కులం, మతం, ప్రాంతం, పేద, ధనిక వర్గాలుగా విభజించలేదని..అందుకే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ప్రధాని అన్నారు. ఈస్టర్న్ ఫెరిపెరల్ ఎక్స్ ప్రెస్ వే వచ్చే సంవత్సరం మార్చి మాసాంతం వరకు పూర్తవుతుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.