ఏడాదిలో 5 రోజులు అడవిలో గడిపేవాడిని!! – మోడీ.

ఏడాదిలో 5 రోజులు అడవిలో గడిపేవాడిని!!

– మోడీ.

null

ఎస్.కే. జకీర్:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువ స్నేహితులకు ఒక సలహా ఇచ్చారు. సుప్రసిద్ధ ఫేస్ బుక్ పేజీ ‘ది హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ప్రతి ఏడాది దీపావళి పండుగ జరిగే ఐదురోజులు తాను పరిశుభ్రమైన నీరు, మానవ సంచారం లేని ప్రదేశంలో ఒంటరిగా గడిపేవాడినని, ఆ సమయంలో తన జీవితాన్ని పరిశీలించుకొనేవాడినని చెప్పారు. ‘ఉరుకులు పరుగుల జీవితం, ఊపిరి సలపని దైనందిన కార్యకలాసాలతో గడిపేవారందరినీ ముఖ్యంగా యువ స్నేహితులను ఓ సారి ఆగి ఆత్మపరిశీలన చేసుకోవలని కోరుతున్నాను. అది మీ అవగాహనను మార్చేస్తుంది. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారని’ మోడీ సూచించారు.‘మీరు నిజమైన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు. అది మీలో ఆత్మవిశ్వాసం పాళ్లని పెంచుతుంది. మీ గురించి ఎవరు ఏమంటున్నారో పట్టించుకోకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ మీకు ఎంతగానో సహాయపడతాయి. మీలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమని గుర్తించాలని కోరుతున్నాను. మీలో ఉన్న వెలుగు కోసం బయట ఎక్కడో వెతకనక్కర్లేదు.’ అని చెప్పారు. తన చిన్నతనం గురించి, ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపడానికి, 17 ఏళ్ల వయసులో రెండేళ్లపాటు హిమాలయాల్లో గడిపిన కాలాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. తను వెనుదిరిగి వచ్చాక ఏం చేశారో మోడీ వివరించారు. ‘హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక ఇతరుల సేవ కోసం నా జీవితం అంకితం చేయాలని నేను గుర్తించాను. కొద్ది కాలానికే నేను అహ్మదాబాద్ కి వెళ్లాను. ఓ పెద్ద నగరంలో జీవించడం అదే నాకు మొదటిసారి. అక్కడ జీవన వేగం చాలా తేడాగా ఉంటుంది. అక్కడ మా బాబాయి కేంటీన్ లో అప్పుడప్పుడు సాయపడుతూ ఉండేవాడిని’ అని చెప్పారు.
‘ఆర్ఎస్ఎస్ లో నేను పూర్తి సమయం ప్రచారక్ గా మారాను. అక్కడ వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. మేం ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని వంతులవారీగా శుభ్రం చేయడం, సహచరుల కోసం టీ కాచడం, వంట చేయడం, పాత్రలు తోమడం చేసేవారం’ అని తెలిపారు. ఆ తర్వాత తను బిజీ అయిపోయయినట్టు ప్రధాని మోడీ చెప్పారు. కానీ హిమాలయాల్లో పొందిన శాంతి అనుభూతిని ఎన్నటికీ కోల్పోనని అన్నారు. జీవితంలో సమతుల్యత సాధించేందుకు అవసరమైన ఆత్మావలోకనం కోసం ప్రతి ఏడాది కొన్ని రోజుల పాటు ఒంటరిగా గడపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.‘చాలా మందికి ఇది తెలియదు, కానీ నేను దీపావళి 5 రోజులు దూరంగా వెళ్లిపోయేవాడిని. ఎక్కడో అడవిలో- పరిశుభ్రమైన నీరు దొరికే మానవ సంచారం లేని ప్రదేశానికి. 5 రోజులకు సరిపడా ఆహారాన్ని కూడా తీసుకెళ్లేవాడిని. అక్కడ రేడియోలు, వార్తాపత్రికలు ఉండవు. ఆ కాలంలో టీవీ, ఇంటర్నెట్ ఎలాగూ లేవు’ అని గుర్తు చేసుకున్నారు. ఒంటరిగా గడిపిన ఆ సమయం ఇచ్చిన బలం ఇప్పటికీ వివిధ పరిస్థితుల్లో జీవితాన్ని గడపడంలో సాయపడుతోంది. అప్పుడు చాలా మంది ‘ఎవరిని కలవడానికి వెళ్తున్నావు?’ అని అడిగితే ‘నన్ను నేను కలుసుకొనేందుకు వెళ్తున్నానని’ సమాధానం చెప్పేవాడినని తెలిపారు