మాపల్లె కూలీతల్లులు. – అవనిశ్రీ.

మాపల్లె కూలీతల్లులు.

– అవనిశ్రీ.

సూర్యూడు తూర్పుకొండలపై సడిచేయకముందే
తొలికోడికూతకే ఎర్రమట్టిపొయ్యి పెంచుమీద
రొట్టెలపై తడిబట్టపూతలైతరు
సందుసివరన కూలీల మేస్ర్తీ కూతేయ్యగనే
ఇరబోసుకున్న ఎంటికల నడ్మ సెండుపువ్వతో
కొప్పును అల్లుకుంటూ
నెత్తిమీద సద్దితో పొద్దును మోస్తున్న పద్యాలౌతరు.
ఒకరెనక ఒకరు
మట్టిబాటలెంట నడుస్తూ
పల్లె నాయమంతటిని కల్లంల రాశిల కుప్పబోస్తరు.
చీర కొంగున ముడేసుకున్న నశం డబ్బను తీసి
చూపుడు వేలితో పండ్లకు పూస్తూ
పల్లె యాసలో మాట్లాడుతూ
భాషని బత్కించే తెలుగు తల్లులౌతారు.
సంతలో పుట్టినింటోళ్ళు తొడిగిచ్చిన
గాజులను పైకి ఎక్కిస్తూ
పెండ్లినాడు కాళ్లకు పెట్టిన కడియాల జారకుండ
బట్టపేలికలు చుట్టుకోని
మునంబట్టగానే పదం అందుకుంటారు
వంతపాడేటప్పుడు
ఆ పాటలినడానికి కొంగలు పాలపిట్టలు ఎగిరొచ్చి
కూలీతల్లుల చుట్టుచేరి కవిత్వం రాసే కవులైతాయి.
వడిగల కూలీతల్లి ముందర్నే మునమెల్లితే
ఎన్కబడిన ముసలవ్వకో
పానంబాగలేక కదలలేని అక్కలకో
ఎదురెల్లి మునంగల్పుకొని సాయం చేసుకుంటరు
కూలీలకాడనే
కడుపు నిండేదాకా పల్కరించుకొని
పల్లెజీవితాన్ని పందిరిగుంజలై నిలబెడ్తారు.
సన్నబిల్లతల్లులు ఎవరన్నవుంటే పాలిచ్చిరమ్మని
పైటాలకు ముందుగనే
సేను పెద్దమనిషి బాయిగడ్డెక్కి కూతేస్తడు
పాలియ్య బాటపట్టిన తల్లికి
నాగుపాములెదురై‌న పడగవిప్పి
పాలిచ్చే తల్లికి మొక్కి దీవెనార్తులిస్తయి.
ఈ కూలీతల్లులు
అచ్చంగా మట్టిబిడ్డలే
పయ్యంత బురదగొట్టుకున్న బట్టలంత దుమ్ముబట్టిన
నువ్వుగింజంతైన నొచ్చుకోరు
మా పల్లె కూలీలు మలినమంటని మట్టిమనుష్యులు
ఈ జీవజాతికి బువ్వబెట్టే శ్రమజీవులు.

దాసరిపల్లి.
మల్దకల్ మండలం.
జోగులాంబ గద్వాల్ జిల్లా.
9985419424.