అంబేద్కర్ నా ఆయుధం అని గ్రహించిన తొలినాళ్ళలో రాసాను..

విత్తునేనై..చెట్టునేనై

విత్తునేనై

చెట్టునేనై
నారువేసిన  చెయ్యినేనై
నీరు పోసిన తొలి చినుకునేనై.

పశువు నేనై,
బలిపశువు నేనై
నీపశులశాలల
బానిసను నేనై
నీ కామదాహపు సమిధనేనై
నీ ఇంటిలోపల పనిమనిషి నేనై
నీ వూరివెలుపల
అంటరానివాడ్నై.

శక్తి నేనై
యుక్తినాదై
రుధిరధారల
చెమటనాదై
చేనిలోపల,
ప్రతీ శ్రమయునాదై
పొలంవెలుపల
ఆకలికేకలునావై.

పొలం నేనై
పంటనేనై
నువ్వుకతికే
ప్రతి మెతుకునేనై
నిజంచెపితే..
నీ బ్రతుకుమొత్తం
మా దళితజాతుల శ్రమఫలితమై.

పాలుగారే
చెక్కిళ్ళునీకే
చందమామల బిడ్డల్లునీకె.
అమ్మప్రేమకు దూరమై
ఏడ్చి ఏడ్చీ..
సొమ్మసిల్లీ
గిడసబారిన
బీద పొట్టలె బిడ్డల్లు మాకు.

దొరసానమ్మలు
బడాబాబులు
అమ్మనస్సలు..
వొదిలిపెట్టక…
కూలిపనిలో పాతిపెడితే,
చనుబాలకైనా నొచుకోక
చెంపలంతా
చారికలు తేలి
డోక్కుపొయిన కళ్ళనిండా
దైన్యమంతా కుక్కుకుంటూ,
యెండిపొయిన
యెముకలేమొ మాబిడ్డలైతిరి.

మా శ్రమకువిలువే కట్టలేక
పుట్టుకే ఒక శాపమౌగ,
కనిపించని
ముంతలెన్నో,
మోసుకుంటూ,
మాకుమేమే భారమొతూ..
దొరల,
దొర కొడుకుల పాదాలకిందే
పసిప్రాయమంతా
వంగిపొయీ
క్రుంగిపొయీ
యెందుకిలా మా బ్రతుకులంటే
చెప్పు దిక్కే కానరాదే.

పైరునిచ్చీ
పంటనిచ్చీ..
మా బ్రతుకులంతా
నీకుదోచి ఇచ్చీ
నువ్వువిడిచిన ఆరెండు మెతుకులే..
ఆ గంజినీళ్ళే
కళ్ళకద్దుకు తాగుతుంటే..
మెళ్ళమీదే
నిను మోస్తు ఉంటే….

యెవడురా అది..
యెవడురా అది..?
మా ఆడబిడ్డల శ్రమతొబాటే..
గౌరవాన్నీ,
యవ్వనాన్నీ కాలరాసిన
కీచకుండా యెవడువాడు..?
యెవడురా అది..
యెవడురా అది?
మా లేబాలింతల,
ముసలి తల్లుల
వుసురుపోసుకు
విర్రవీగుతున్నది?
నా భూమిలాక్కుని,
భుక్తి లాక్కొని..
నా బిడ్డల చెరిచీ,
భార్యల చెరిచీ..
బానిసను చెస్తివి,
మా తండ్రుల కొడుకుల.
ఇంతచేసీ..
ఇంత దోచీ,
మళ్ళీఅదేపాట,
మాల అంటూ,
మాదిగంటూ..
యెందుకొసం ఈశ్రమలు మాకు?
ఎంతకాలం ఈ బానిసత్వం?
కష్టమంతా మాకుమోపి
సుఖాలపరుపుల నువ్వుపొర్లితే?
మా బతుకులన్నీ కాలరాసి
మా శవాలపై నువ్
గోరీలు కడితే?

సాగదింకా ఈ విలాసం.
చూపాలిక మా ప్రతాపం.
చెమటనే రక్తాన్నిచేస్తాం,
మాబహుజన రాజ్యం
స్థాపించి తీరుతాం.
మేముసైతం
పాలించితీరుతాం.

-Aruna Gogulamanda 23.03.’15.