‘రక్త వసంతాలాడే దండకారణ్యమై రాయి’.

‘రక్త వసంతాలాడే దండకారణ్యమై రాయి’.

Telugu poetry

విజయ్ సాధు:

ఇక్కడ అంతా శాంతమే…
ఇప్పుడు అంతా ప్రశాంతమే
అన్నీ మర్చిపోయాం కదా,
గుర్తుండి కూడా పట్టనట్లే ఉన్నాం కదా,
అందుకే అంతా శాంతం…ప్రశాంతం
నువ్వు,నేను స్వార్ధంతో సంసారం చేస్తున్నప్పుడు,
వాళ్లిద్దరూ మన భవిష్యత్తుకోసం అన్నీ వదులుకున్నారు,
మనమిద్దరం ప్రపంచాన్ని పట్టించుకోనప్పుడు..
వాళ్లిద్దరూ కేవలం మన గురించే ఆలోచించారు,
మనమిద్దరం తెగతిని గాఢనిద్రలో సేదతీరుతున్నప్పుడు,
వాళ్లిద్దరూ మనకోసమే మేల్కొన్నారు,
మనమిద్దరం మనకోసమే బతుకుతుంటే,
వాళ్లిద్దరు మాత్రం నవసమాజ నిర్మాణానికి రాళ్లెత్తారు.
అయినా ఇవేమీ మనకు గుర్తులేవు కదా..?
కాబట్టే ఇక్కడ అంతా శాంతం, ప్రశాంతం.
ఛీ…మనదీ ఒక బతుకేనా…?
ఛీ…మనదీ ఒక జన్మేనా…?
లే..లేవరా లే…పదునెక్కిన పాటై లే,
కదం తొక్కే ఆయుధమై లే,
మట్టికి మాటలు నేర్పే నినాదమైలే,
గాలికి గమనం నేర్పే శబ్ధమై లే,
వ్రాయరా వ్రాయి…
కసి పుట్టించే కవిత్వం వ్రాయి,
నరాలన్నీ ఏకమై నిలదీసేలా వ్రాయి,
నిజాలొక్కటై నిగ్గదీసే అక్షరాలు వ్రాయి,
అమ్మలాంటి అడవి పులకించే వాక్యాలు వ్రాయి,
బందీఖానాల్లో భూకంపం పుట్టే విప్లవ కవిత్వమే వ్రాయి,
భయమేస్తోందా…? అక్రమ నిర్భంధ ఊహా ఆపేస్తోందా..?
నీది,నాది ఏది లేదిక్కడ..!
పుట్టుక నీది..చావు నీది..బతుకంతా ప్రజలది,
ఊపిరి నీది, ఉద్యమం నీది,
జీవితమంతా సమాజానిది,
ముందుగా వాళ్లిద్దరి కోసం వ్రాయి,
నిరంకుశ నిర్భంధంలోనూ నవ్వుల వసంతాన్ని పూయిస్తున్న “వి.వి, సాయి” కోసం వ్రాయి.
ఇకపై బతికినంతకాలం మనకు బతుకునిచ్చిన వాళ్ల కోసమే వ్రాయి.
మన కోసం బతుకు దీపాన్ని ఆర్పేసుకున్నోళ్ల కోసమే వ్రాయి.
శాలువాల కింద చలి కాచుకుంటూ,
సన్మానాల సయ్యాటల్లో ఊరేగే వాళ్లంతా ఉరివేసుకునేలా వ్రాయి,
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ గుండెలపై చెరిగిపోని RSU సంతకమై వ్రాయి,
రక్త వసంతాలాడే దండకారణ్యమై రాయి,
కసి పుట్టించే కవిత్వం వ్రాయి,
రాజ్యం కుట్రలు బద్దలు కొట్టే కవిత్వం మాత్రమే వ్రాయి,
తుదిలేని వెతలకు మొదలు కనిపెట్టి మరీ వ్రాయి.

(Facebook సౌజన్యంతో)