ప్రజ్ఞా ఠాకూర్ ప్రతి వారం కోర్టుకి రావాల్సిందే

మాలేగావ్ పేలుళ్ల కేసులో బీజేపీకి చెందిన ప్రజ్ఞా ఠాకూర్ సహా నిందితులంతా ప్రతి వారం కోర్టులో హాజరు కావాల్సిందేనని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది. మాలేగావ్ కేసు విచారణ సందర్భంగా ప్రజ్ఞా, ఇతర నిందితులు గైర్హాజరు కావడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తదుపరి విచారణ మే 20న జరుగుతుంది. ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్ పై బయటికొచ్చారు. ఆమె బీజేపీ టికెట్ పై భోపాల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో బీజేపీ టికెట్ పై భోపాల్ నుంచి పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మంది నిందితులుగా ఉన్నారు. ఇంతకు ముందు ఎన్ఐఏ కోర్టు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ తనకు కేసు దస్తావేజులు ఇవ్వాల్సిందిగా కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

29 డిసెంబర్ 2008న రంజాన్ సమయంలో మాలేగావ్ లోని అంజుమన్ చౌక్, భీఖూ చౌక్ దగ్గర వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మందిని దోషులుగా భావించి అరెస్ట్ చేసింది. డిసెంబర్ 2017లో మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్ పై మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యాక్ట్ తొలగించారు.