రాఫెల్ ఒప్పందంలో కానరాని కోణాలు!!

null

హైదరాబాద్:

రాఫెల్ యుద్ధవిమానాల తయారీ జాయింట్ వెంచర్ లో వాణిజ్యేతర వ్యవహారాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఇంకా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇంతలోనే ఓ నివ్వెరపరిచే వార్త వెలుగుచూసింది. ‘ది వైర్’ ప్రత్యేక కథనం ప్రకారం రాఫెల్ ఒప్పందం తర్వాత క్రియాశీలంగా లేని అనిల్ అంబానీ కంపెనీ ఏకంగా రూ.284 కోట్ల లాభం కళ్ల చూసింది. దీనికి కారణం ఆ కంపెనీలో దసాల్ట్ పెట్టుబడులు పెట్టడమేనని ఆ కథనంలో ది వైర్ పేర్కొంది. అనిల్ అంబానీ కంపెనీతో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా ఫ్రెంచ్ కంపెనీ సుమారుగా 4 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టి ఎవరికీ కనీ,వినిపించని కంపెనీలో 35% శాతం వాటా కొనుగోలు చేసిందనే వార్త సంచలనం సృష్టిస్తోంది. చట్టప్రకారం ఫ్రాన్స్, భారత్ లో దాఖలు చేసిన పత్రాల ప్రకారం దసాల్ట్ ఏవియేషన్ రాఫెల్ ఒప్పందం కుదిరిన తర్వాత 2017లో దాదాపు 4 మిలియన్ యూరోలను అనిల్ అంబానీకి చెందిన నష్టాల్లో కూరుకుపోయి ఆదాయమే ఆర్జించని కంపెనీలో పెట్టుబడిగా పెట్టింది. ఈ పెట్టుబడి అంబానీ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ (ఆర్ఏడీఎల్)కు రూ.284 కోట్లు లాభంగా మారింది. అయితే ఆర్ఏడీఎల్ లో వాటాను ఏ ప్రాతిపదికపై విలువ కట్టారు? అసలు దసాల్ట్ తన వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేని కంపెనీ..అందులోనూ ఆదాయం రాని, లిస్ట్ కాని కంపెనీలో ఎందుకు 35% భారీ వాటాను కొనుగోలు చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఫైల్ చేసిన పత్రాల ప్రకారం తన అనుబంధ సంస్థ ఆర్ఏడీఎల్ లో 34.7% వాటాను దసాల్ట్ ఏవియేషన్ కు అమ్మేసింది. అమ్మకానికి సంబంధించిన షరతులేంటో చెప్పకుండా రిలయన్స్ ఒక్కోటి రూ.10 ముఖ విలువకు 24,83,923 షేర్లను అమ్మడం ద్వారా రూ.284.19 కోట్ల లాభం ఆర్జించినట్టు పేర్కొంది. మార్చి 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ రూ.10.35 లక్షల నష్టం చూపించింది. మార్చి 2016లో ఈ సంస్థ నష్టాలు రూ.9 లక్షలుగా ఉన్నాయి. ఈ కంపెనీకి తన గ్రూపుకే చెందిన పలు అనుబంధ సంస్థల్లో వాటాలు ఉన్నాయి. వాటిలో చాలా కంపెనీలు నష్టాల పాలయ్యాయి. వీటన్నిటి దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం 2009లో రూ.63 కోట్లకు ఇచ్చిన ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 2015లో బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం పనుల్లో పురోగతి లేని కారణంగా వాటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. దీంతో ఎయిర్ పోర్టులో పెట్టిన వాటాలను వెనక్కి తీసుకోవాలని కంపెనీ భావించింది. కానీ హఠాత్తుగా జనవరి 2017లో మనసు మార్చుకొని కొనసాగింది. విచిత్రం ఏంటంటే మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎంఏడీసీ) ఆర్ఏడీఎల్ పనితీరుతో అసంతృప్తి చెంది వాటన్నిటిని వెనక్కి తీసుకొనేందుకు సిద్ధమైంది. వేరే కంపెనీకి ఇచ్చేందుకు 289 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసింది. మరి నష్టాల పాలై మూసేయడానికి దగ్గరలో ఉన్న ఇలాంటి కంపెనీలో దసాల్ట్ ఎందుకు పెట్టుబడి పెట్టింది. అది కూడా రూపాయైనా ఆర్జించని సంస్థ నుంచి తిరిగి ఏం వస్తుందని నమ్మిందనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
దసాల్ట్ ఏవియేషన్ తన 2017 వార్షిక నివేదికలో నాన్ లిస్టెడ్ సెక్యూరిటీస్ లో భాగంగా ఆర్ఏడీఎల్ నుంచి 34.7% వాటాను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణను చూస్తున్న ఆర్ఏడీఎల్ లో 35% వాటా పొందడం ద్వారా భారత్ లో కంపెనీ బలోపేతం అయిందని చెప్పింది. మరోవైపు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెబ్ సైట్ లో పెట్టిన రిలయన్స్ ఎయిర్ పోర్ట్స్ వార్షిక నివేదికలో దసాల్ట్ ఏవియేషన్ 34.79% సాధారణ షేర్లు పొందిందని పేర్కొన్నారు. కానీ ఈక్విటీ షేర్లకు సంబంధించిన నిబంధనలు, అధికారాల గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. వీటన్నిటికీ తోడు ఈ డీల్ రాఫెల్ కొనుగోలు ఒప్పందం తర్వాత జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.