రాఫెల్ డీల్ లో చౌకీదారే చోర్: రాహుల్ గాంధీ.

న్యూఢిల్లీ:

రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండే తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హోలాండే వ్యాఖ‍్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలన్నడిమాండ్‌ ఊపందుకుంది. హోలాండే ప్రకటనతో ఇన్నాళ్లూ తాము చెబుతున్న మాటే నిజమని తేలిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోడీ సర్కార్‌పై తన దాడిని తీవ్రం చేశారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోడీ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విమానాల తయారీలో అనుభవమే లేని అనిల్‌ అంబానీ కంపెనీ ఎంపిక భారత ప్రభుత్వానిదేనని హోలాండే స్పష్టంగా చెప్పడంతో ప్రధాని అవినీతికి పాల్పడ్డారని తేలిపోయిందంటూ రాహుల్‌ విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో భారీ అవినీతికి పాల్పడి దేశానికి కాపలాదారుడిగా ఉంటానన్న మోడీ దొంగగా (దేశ్‌ కా చౌకీదార్‌ చోర్‌ హై) మారారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నాఇన్ని ఆరోపణలు వస్తున్న మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హోలాండే ప్రకటనను ఖండించడమో లేదా నిజమని అంగీకరించడమో చేయాలని రాహుల్ డిమాండ్‌ చేశారు.ఒక్కొక్కటిగా దివాలా తీస్తున్న అనిల్ అంబానీ కంపెనీలకి మేలు చేసేందుకు ప్రధాని మోడీ తెరవెనుక మంత్రాంగం నడిపి రాఫెల్‌ ఒప్పందాన్ని మార్చారని రాహుల్ ఆరోపించారు. మాజీ రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కాకుండా ఈ డీల్‌పై స్వయంగా మోడీనే సంతకాలు చేశారన్నారు.