“నా సోదరి సమర్థురాలు, ఇక యుపిలో ఫ్రంట్ ఫుట్ పై ఆడతాం’!! – రాహుల్ గాంధీ.

“నా సోదరి సమర్థురాలు, ఇక యుపిలో ఫ్రంట్ ఫుట్ పై ఆడతాం’!!
– రాహుల్ గాంధీ.
null

ఎస్.కే. జకీర్:

తన సోదరి ప్రియాంక ఆమెకి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడంలో సమర్థురాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆమెలో ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు కొత్త దిశను నిర్దేశించాల్సిన అవసరం ఉందని అందుకే ప్రియాంకను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తూర్పు యూపీ ఎన్నికల ఇన్ ఛార్జిగా నియమించినట్టు తెలిపారు. తన సొంత నియోజకవర్గం అమేథీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్, ప్రియాంకకు తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైందన్నారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అధికారం కట్టబెట్టి యుపి ప్రజలు ఎంతో సమయం వృథా చేశారని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. యుపిలో కాంగ్రెస్ ని పక్కన పెట్టేయొద్దని, రాబోయే సాధారణ ఎన్నికల్లో పార్టీ తన పూర్తి బలంతో పోరాడనుందని స్పష్టం చేశారు. ఎస్పీ-బీఎస్పీ ఎన్నికల పొత్తుపై వ్యాఖ్యానించకుండా బీజేపీని టార్గెట్ గా చేశారు. ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇది రాహుల్ గాంధీ మాస్టర్ స్ట్రోక్ గా చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రియాంక వాద్రా అమేథీ, రాయ్ బరేలీలో ప్రచారానికే పరిమితమయ్యారు. ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ ఛార్జిగా నియమించడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించారు.