రామోజీరావు మొదటి ఓటమి!! – బండారు శ్రీనివాసరావు

(ఈ పోస్టుకు శీర్షిక పెట్టడం మినహా మిగిలిన ప్రతి అక్షరం సుప్రసిద్ధ పాత్రికేయులు కీర్తిశేషులు వీ.హనుమంతరావు గారి సొంతం. ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ అనే పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ఈ సమాచారం పొందుపరిచారు. ఇందులో కొన్ని భాగాలు 2012లో నా బ్లాగులో పోస్ట్ చేస్తే సుమారు పదివేలమంది స్పందించారు.ఆ గొప్పతనం ఆయనదే)

ఇక చదవండి:

“యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో కొత్తగా ప్రారంభించిన ‘ఈనాడు’ ఎడిషన్ లో చేరాను. నాతో కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు – ఏబీకే ప్రసాద్, పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్. వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడు’ అన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ‘ఈనాడు’లో ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు చిరపరిచితమే.”

“ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో ఇద్దరు ‘ఈనాడు’ మాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు ‘ఈనాడు’ పత్రిక ప్రజల ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు – సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి ఓటమి.”

“పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను, ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.”

“పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి.”

“నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.”

“1955 మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”

“హైదరాబాదులో (యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం) కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.”

“రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు, స్కూటర్లు, కార్లు, మందు సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్ ని ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?”

(జర్నలిష్ట్ అంతర్వీక్షణం – పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు – అనుభూతులు – రచన : శ్రీ వి.హనుమంత రావు – ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్ – 500 084)

07-07-2012

Source: F.B