ప్రధానిపై రమ్య అభ్యంతరకర వ్యాఖ్యలు!!

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ దివ్య స్పందన (రమ్య) ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే మైక్రో బ్లాగింగ్ సైట్ లో వైరల్ గా మారింది. రమ్య ట్వీట్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత ప్రథమ ఉప ప్రధానమంత్రి, హోమ్ మంత్రి సర్దార్ పటేల్ జయంతి (31 అక్టోబర్) సందర్భంగా ప్రధాని మోడీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. రమ్య తన ట్వీట్ లో సర్దార్ పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ‘ని జాతికి అంకితం చేసే సమయంలో ప్రధాని మోడీ ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో మోడీ తెల్లని వస్త్రాలు ధరించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పాదాల దగ్గర నిలబడి ఉన్నారు. ఆ ఫోటోతో పాటు రమ్య రాసిన వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉంది. రమ్య ‘Is that bird dropping?‘ అని రాసింది. రమ్య వ్యాఖ్యకు అర్థం పిట్ట రెట్టా? అని అడుగుతున్నట్టు స్పష్టమవుతోంది.మహా విగ్రహం పాదాల దగ్గర నిలబడిన ప్రధాని మోడీ చాలా చిన్నగా కనిపిస్తున్నారు. రమ్య దీనిని వ్యంగ్యార్థంలో ఉపయోగిస్తూ ట్వీట్ చేసింది. రమ్య వ్యంగ్యం కాస్తా అభ్యంతరకర వ్యాఖ్య అని చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రమ్యపై ట్రోలింగ్ దాడి మొదలైంది.దేశ ప్రధానిని పిట్ట రెట్టతో పోల్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. దివ్య స్పందన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తిని కించపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వైఖరే అంతంటూ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.రమ్య మాత్రం తన వాదనను సమర్దించుకుంటోంది. తాను అన్న దానిలో తప్పేముందని ట్రోలర్స్‌కు సమాధానం చెప్పింది.