కేసు జటిలమైందా! జటిలం చేసుకుంటున్నాడా!! ‘రవి సేన’ ఏర్పడుతుందా ?

Hyderabad:

మోసం,దగా, ఫోర్జరీ తదితర నేరపూరిత అభియోగాలు ఎదుర్కుంటున్న టీవీ9 మాజీ ఉద్యోగి రవిప్రకాష్ తరపున కొందరు జర్నలిస్ట్ లు రంగంలో దిగారు. రవికి మద్దతుగా పోరాటాలు చేబడతామని వారు ఆదివారం ప్రకటించారు.

రవిప్రకాష్ పై జరుగుతున్న అక్రమ కేసులకు నిరసనగా ఈ నెల 11వ తేదీ నుండి ఇందిరా పార్క్ లో రిలే నిరాహార దీక్ష చేపడతామన్నారు. విజనరీ జర్నలిస్ట్ రవిప్రకాష్ పై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించే వరకు ఉద్యమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అఖిల భారత హైందవ జర్నలిస్ట్ సంఘాన్ని నడుపుతున్న గోపీ యాదవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది.రవి ప్రకాష్ కు మద్దతుగా నిలవాలని కోరుతూ గద్దర్, విమలక్క, ఆర్.కృష్ణయ్య, కోదండరాంలతో పాటు పలువురు ప్రముఖులను,సీనియర్ జర్నలిస్ట్ లను టీవీ9 విలేకరి, గోపీ యాదవ్ సంప్రదింపులు జరుపుతున్నారు.రవిప్రకాష్ మాజీ సహ ఉద్యోగి కరీంతో పాటు మరికొందరు రవికి మద్దతు తెలిపినట్టు మీడియా వర్గాలలో ప్రచారం ఉన్నది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమావేశానికి సుమారు 10 నుంచి 15 మంది జర్నలిస్టులు హాజరయ్యారు.’మోజో’ లో పని చేసే రిపోర్టర్ లు కూడా వెళ్ళారు.”రవి ప్రకాష్ హిందూ వ్యతిరేకి.ఆయనకు తాము ఎట్లా మద్దతుగా నిలబడతామ”ని కొందరు జర్నలిస్టులు అభ్యంతరం తెలిపినట్లు తెలియవచ్చింది.’రవి ప్రకాష్ పైన ప్రభుత్వ పెద్దలు,వాళ్ళ బినామీలు అక్రమ కేసులతో వేధిస్తూ తెలంగాణ సమాజంలో కొత్తరకం మాఫియాగా ముందుకు వస్తున్నది.

జర్నలిజంలో కొత్తరకం మాఫియా తెలంగాణ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి సంక్షోభ సమయంలో సమాజానికి దిశా నిర్దేశం చేయగలిగే బాధ్యత జర్నలిస్టుదే. తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రవిప్రకాష్ పై జరుగుతున్న అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం నుండి ఇందిరా పార్క్ లో నిరాహార దీక్ష చేపడతాము. విజనరీ జర్నలిస్ట్ రవిప్రకాష్ పై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించే వరకు ఉద్యమాలు చేపడుతాము” అని zee tv వంటి ఛానళ్లలో పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ సతీశ్ కమాల్ ఒక వీడియో సందేశం ఇచ్చాడు. అన్ని పార్టీల నాయకులను కలుసుకొని రవిప్రకాష్ కు మద్దతు ను కూడగట్టేందుకు గోపీ యాదవ్, సతీష్ కమాల్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడినట్టు సమాచారం ఉన్నది.రవిప్రకాష్ ను ఒకటీ,రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్న సమాచారం తోనే ఆయన ‘అభిమానులు’ ఇలాంటి హడావుడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పెట్టుబడి దారులు, యాజమాన్యం మార్పిడి వంటి వ్యాపార కార్యకలాపాలలో ఫోర్జరీ వంటి అభియోగాలను రవిప్రకాష్ ఎదుర్కొంటూ ఉండగా సగటు మీడియాకు, జర్నలిస్ట్ లకు ఆ కేసులతో సంబంధం ఏమిటో అంతు చిక్కడం లేదు.కొందరు రవిప్రకాష్ ‘లబ్ధిదారులు’, ఆయన అభిమానులు ఒక ‘సేన’ ఏర్పడాలని ప్రణాళికలు రచిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసుల విచారణ సందర్భంగా పోలీసులకు సహకరించకుండా ఈ సమస్యను రవిప్రకాష్ స్వయంగా జటిలం చేసుకుంటున్నట్టు వారు భావిస్తున్నారు.కొందరు టీవీ9 మాజీలు కూడా రవిప్రకాష్ కు ‘అజ్ఞాతంగా’సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయా మాజీల గురించి ‘ఆరా’తీస్తున్నామని వారు తెలిపారు.’మాజీలు’ రవిప్రకాష్ తో ఎక్కడెక్కడ సమావేశాలు జరుపుతున్నారు?ఇంకా ఎవరెవరు వారిని కలుస్తున్నారు?వంటి అంశాలపై దర్యాప్తు సాగుతున్నది.ఉప్పల్ కు చెందిన ప్రస్తుత టిఆర్ ఎస్ నాయకుడు,కాంగ్రెస్ మాజీ నాయకుడొకరిపై ప్రత్యేక నిఘా పెట్టారు.