రవిప్రకాష్ ఒక మనిషి !!

ఎస్.కె.జకీర్:

”నువ్వు రవిప్రకాష్ తో చేరావా ”? అని ఒక మిత్రుడు/శ్రేయోభిలాషి మంగళవారం రాత్రి అడిగాడు. ”లేదు” అని చెప్పాను. ”నువ్వు రవిప్రకాష్ వైపు ఉన్నావా”? అని అని ఇంకో ప్రశ్న వేశాడు. ”లేదు” అని చెప్పాను. ”ఎందుకు అడుగుతున్నావ్” అని నేను అడిగా. ”నువ్వు ఎటు వైపు ఉన్నావో తెలుసుకుందామని”! అని అన్నాడతను. ”ఎటు వైపు”!! అంటే? రవిప్రకాష్ ఎటు వైపు ఉన్నాడు? ఆయన మావోయిస్టుల్లో చేరాడా ?సంఘ విద్రోహకర శక్తా? జైషే మొహమ్మద్ వంటి టెర్రరిస్టులతో సంబంధాలు ఏమైనా పెట్టుకున్నాడా? అని నేను మళ్ళీ అడిగాను. ”ప్రస్తుత పరిస్థితుల్లో రవిప్రకాష్ కు సపోర్టు చేయడం మంచిది కాదు” అని మాత్రమే ఆ మిత్రుడు ఉచిత సలహా ఇచ్చాడు. రవిప్రకాష్ గురించి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి పోస్టింగులు పెట్టవద్దని మరికొందరు శ్రేయోభిలాషులు చెపుతున్నారు. రవిప్రకాష్ తో ‘హిందుస్థాన్ టైమ్స్’ రిపోర్టర్ శ్రీనివాస్ exclusive interview చేశాడు. ఆ వార్త క్లిప్ ని నేను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో, పేస్ బుక్ లో షేర్ చేశాను. దాంతో ఈ గొడవ మొదలైంది. జర్నలిజంలో బిల్డర్లు, కాంట్రాక్టర్ల జోక్యానికి వ్యతిరేకంగా తన ప్రతిఘటన కొనసాగనుందని రవిప్రకాష్ ‘హిందుస్థాన్ టైమ్స్’ కు చెప్పాడు. రవిప్రకాష్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించడం లేదు. దేశంలో అన్ని వ్యవస్థలూ కార్పొరేటీకరణ జరుగుతున్నపుడు, అన్ని వ్యవస్థలనూ స్వార్థపర రాజకీయ శక్తులు సర్వ నాశనం చేస్తున్నప్పుడు మీడియా ఎట్లా మినహాయింపు కాగలదు.పైగా రవిప్రకాష్ ఎవరిపైన పోరాటం చేస్తాడు? ఆయనకిప్పుడు జర్నలిస్టుల తోడ్పాటు లేదు. ఆయనను పెట్టుబడిదారునిగానో, పారిశ్రామికవేత్తగానో జర్నలిస్టులు భావిస్తున్నారు. రవిప్రకాష్ సొంతంగా టీవీ ఛానల్, భారీగా ఒక దినపత్రికను అవలీలగా స్థాపించే రీతిలో ధనబలం ఉందని అంటున్నారు.ఇక ఆయన ఎంత మాత్రం ఉద్యోగిగా పనిచేయడని, అలాంటి దశ దాటి పదేళ్ళయిపోయినట్టు మరికొంతమంది చెబుతున్న మాట. కాగా భారతదేశంలో పెట్టుబడిదారులు రకరకాల రూపాల్లో విస్తరిస్తున్నారు. ఇది రహస్యమేమీ కాదు. జాతీయస్థాయిలో పలు మీడియా సంస్థలు కార్పొరేట్ శక్తుల గుప్పిట ఉన్న సంగతి రవిప్రకాష్ కు తెలియదని ఎట్లా అనుకోగలం. తెలుగు మీడియా రంగానికి కూడా ఆ జాడ్యం సోకి చాలా కాలమైంది. లేకపోతే ఇన్ని చానెళ్లు ఎట్లా పుట్టుకొస్తాయి. టీవీ 9 స్థాపన సమయంలో పరిస్థితులు వేరు. తెలుగులో 24/7 వార్తా చానళ్ల గురించి ఎవరికీ అవగాహన లేదు. అవి నడుస్తాయన్న నమ్మకం అంతకన్నా లేదు. రవిప్రకాష్ ‘విజన్’ ఉన్నవాడు కనుకనే ‘i labs’గ్రూప్ ఐ.టి కంపెనీల అధిపతి శ్రీనిరాజును ఆయన పార్టనర్స్ రవి సన్నారెడ్డి వంటి వారిని ఒప్పించి, నమ్మించి టీవీ 9 ను స్థాపించగలిగాడు. అయితే ఇప్పుడాయన టీవీ9 మాజీ సిఈఓ . బుధవారం సాయంత్రానికి అందుతున్న సమాచారాన్ని బట్టి ఒకటీ, రెండు రోజుల్లో ఆయనను అరెస్టు చేయవచ్చు.మే 8, 9 తేదీల నుంచి తెలుగు ప్రధాన స్రవంతి వార్తా ప్రపంచంలోనూ, సోషల్ మీడియాలోనూ రవిప్రకాష్ ప్రతిరోజూ వార్తల్లోని వ్యక్తిగా మారిపోయాడు. అందుకు కారణం రవిప్రకాష్ తెలుగు మీడియాలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించడమే. 2003,2004 కు ముందు రవిప్రకాష్ వేరు. ఇప్పటి రవిప్రకాష్ వేరు. తన కఠోరశ్రమతో, పట్టుదలతో, సృజనాత్మకతతో టీవీ 9 ను తెలుగునాట ఒక brand గా మలిచాడు. ఆ క్రమంలో తనను తాను కూడా ‘బ్రాండ్’ గా తీర్చిదిద్దుకున్నాడు. కాగా ఆయన సక్సెస్ గ్రాఫ్ టీవీ 9 తో పాటే పెరుగుతూ వచ్చింది.పనిలో పనిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఆయన నిర్మించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నవి. ‘మోజో’ టీవీ, ‘మెలూహా’ ఇంటర్నేషనల్ స్కూల్, ‘తొలివెలుగు’ వెబ్ సైటు, ఈవెంట్ మేనేజ్ మెంటు సంస్థ ‘R factory’, గ్రాఫిక్స్ కంపెనీ ‘I ఫ్రేమ్స్’ , దక్షిణాఫ్రికాలో ఇంటర్నెట్, కేబుల్ వ్యాపారాలు, హైదరాబాదు పరిసరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు రవిప్రకాష్ ఖాతాలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఆయనపైన పలు కేసులు నమోదైనవి.ఇవి ఆయన కలలో కూడా ఊహించని పరిణామాలు కావచ్చును. మోసం, నమ్మకద్రోహం,సంస్థకు హాని కలిగించడం, నిధులు మళ్లించడం వంటి సెక్షన్ల కింద అరెస్టు కాబోతున్నాడు. ఆ కేసులన్నీ నిజమేనా ? కల్పితమా ? నిజంగా ఫోర్జరీకి పాల్పడ్డాడా? న్యాయపరమైన అంశాలు ఏమిటి ? రవిప్రకాష్ నిర్దోషిగా బయట పడతాడా,లేదా ? వంటి అనేక ప్రశ్నలకు జవాబు త్వరలోనే దొరుకుతుంది.ABCL సంస్థ నుంచి టీవీ 9 గ్రూప్ న్యూస్ చానళ్లను ‘మై హోం’ గ్రూపు, ‘మేఘా’ ఇంజనీరింగ్ సంస్థల కన్సార్టియం’ అలందా మీడియా’ పేరిట కొనుగోలు చేసింది. అలందా మీడియా, ABCL మధ్య వాటాల బదలాయింపులు, లావాదేవీలు ఇతర కార్యకలాపాలకు సంబంధించి కొన్ని గొడవలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తినవి. ఇవి నిజంగా తలెత్తినవా? లేక సృష్టించినవా ? అన్నది మరో ప్రశ్న.

ప్రధానంగా ఫోర్జరీ ఆరోపణలను రవిప్రకాష్ ఎదుర్కుంటున్నాడు. ఫోరెన్సిక్ నివేదికలో ఏమున్నదో వెల్లడి కాలేదు.”రవిప్రకాష్ టీవీ 9 లో ఒక ఉద్యోగి. సంస్థ యజమానులు వేరే వారికి ఆ సంస్థను అమ్ముకున్నపుడు తనకు రావసిందేమిటో తాను తీసుకొని బయటపడితే ఈ సమస్యలు ఉండేవి కాదు కదా” ! అన్నది పబ్లిక్ టాక్.నూటికి నూరు పాళ్ళు ఈ అభిప్రాయానికి ఎక్కువ మద్దత్తు లభిస్తుంది. కానీ ”రవిప్రకాష్ ను ఎవరూ టచ్ చేయలేరు సార్. మీరు చూస్తూ ఉండండి.ఆయనకు, కేసీఆర్ కు మధ్య మా హోటల్ లోనే లగ్జరీ సూట్ లో రాజీ కుదిరింది. రవిప్రకాష్ తరచూ మా హోటల్ కు వస్తుంటారు. ఆయనను కలవడానికి చాలామంది పెద్ద మనుషులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఆయన నెట్ వర్క్ చాలా పెద్దది. ప్రధానమంత్రి మోడీతో డైరెక్టుగా మాట్లాగలిగిన పరపతి రవిప్రకాష్ కు ఉంది” అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉద్యోగి నాకు చెప్పాడు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానళ్లు ‘నిషేధానికి’ గురైన సంగతి లోక విదితమే. తర్వాత ఆ రెండు చానళ్లకు,ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరడంతో వాటి ప్రసారాలు మరలా కొనసాగాయి. ‘

‘రవిప్రకాష్ ముందు కేసీఆర్, చంద్రబాబు నెట్ వర్క్ ఎందుకూ పనికి రాదు” అని కూడా ఆ హోటల్ ఉద్యోగి అన్నాడు. నాకిది అతిశయోక్తి అనిపించింది. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల కన్నా, ‘రాజ్యం’ కన్నా ఒక టీవీ ఛానల్ CEO ఎన్నటికీ శక్తిమంతుడు కాలేడని నా అభిప్రాయం. రవిప్రకాష్ మంచివాడా ? చెడ్డవాడా ? అనే ప్రశ్న కొందరు వేస్తున్నారు.సామాజిక ప్రమాణాల ప్రకారం మంచివాళ్ళు,నిజాయితీపరులు ఎన్నటికీ నాయకుడు కాలేరు. మొండితనం,తెగింపు,ధైర్యమూ, సాహసమూ వంటి లక్షణాలతో పాటు కొంత ‘విలనిజం’, మోసకారితనం ఉన్నవాడే ఏ రంగంలో అయినా లీడర్ లేదా కెప్టెన్ కాగలడని చరిత్ర చెబుతున్నది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదాహరణలు, సందర్భాలూ చాలా ఉన్నవి. అయితే రవిప్రకాష్ తనకు తాను టీవీ9 లో ‘బాస్’ వలె కాక, ఆ సంస్థ పాలిట ‘దేవుని’గా భావించడం మొదలైన తర్వాత ఆయనలోని ‘పెట్టుబడిదారు’ విశ్వరూపాన్ని ప్రదర్శించడం ప్రారంభమైంది. తాను చెప్పిందే వేదం, తాను మునిగిందే గంగ అనే మానసిక ధోరణిలోకి వెళ్లిపోవడం వల్ల సమస్యలు పుంజుకున్నవి. తెలుగు మీడియాలో తానే ‘సృష్టికర్త’ అని కూడా రవిప్రకాష్ భ్రమ పడ్డాడు. తనతో పాటు ఒక బృందం నిర్విరామంగా పని చేసినందుకే టీవీ 9 ఇవాళ ఈ దశలో ఉందన్న సత్యాన్ని ఒప్పుకోవడానికి రవిప్రకాష్ సిద్ధంగా లేడు. ఇదిలా ఉండగా రవిప్రకాష్ నాయకత్వ లక్షణాల పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల భిన్నాభిప్రాయాలూ, వివాదాలూ ఉన్నవి. అందుకే ఆయనకు సామాజిక మాధ్యమాల్లో మద్దతు కొరవడింది. పేస్ బుక్,వాట్సాప్, యూట్యూబ్ తదితర మాధ్యమాల్లో రవిప్రకాష్ పై టన్నుల కొద్దీ తిట్లు కురుస్తున్నవి.అయ్యోపాపం అనే వారు కరువయ్యారు. ఇదొక విషాదం.

మీడియాలోనూ విభజన స్పష్టంగా కనిపిస్తున్నది. రవిప్రకాష్ భక్తులు/లబ్ధిదారులు ఒక వైపు, బాధితులు మరో వైపు మోహరించారు. నిష్కారణంగా ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన వారి కడుపు మంట చల్లారుతుందా? తన వందిమాగధులకు,చెంచాలకు,ఊడిగం చేసే వారికి,అసమర్ధులు, బానిసలకు, తనకు ఇన్ఫార్మర్లుగా ఉన్నవారికి మాత్రమే పెద్ద పీట వేసిన సందర్భాలూ, అనూహ్యమైన జీతభత్యాలు ఇవ్వడం, ప్రమోషన్లు ఇవ్వడం వంటి ఘటనలు చాలా ఉన్నవి. అవన్నీ సంస్థను నడిపే మేనేజ్ మెంటు స్కిల్స్ లో భాగమని రవిప్రకాష్ సమర్ధించుకోవచ్చును కూడా. అన్ని సార్లూ ఆ సమర్ధన చెల్లుబాటు కాదు.కాగా పూర్వాశ్రమంలో PDSU సానుభూతిపరునిగా ఉన్నందుకు గాను, అదే PDSUలో పనిచేసిన చాలా మంది రవిప్రకాష్ ను గుడ్డిగా వెనకేసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు.టీవీ 9 కు చెందిన కొందరు రవిప్రకాష్ ‘వీరాభిమానులు’ మే 9, 10 తేదీల్లో ఆయనను రహస్యంగా కలిసి తమ మద్దతును ప్రకటించినట్టు తెలియవచ్చింది. ఇక రవిప్రకాష్ పుణ్యమా అని తమకు సమాజంలో గుర్తింపు లభించిందని ఆయన పట్ల భక్తిని,గౌరవాన్ని కొందరు చాటుకుంటున్నారు. ఇక రవిప్రకాష్ లో మరో కోణాన్ని పసిగట్టిన వాళ్ళు చంద్రబాబు, కేసీఆర్ మాత్రమే. 2004 లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి టీవీ 9 ఎంతగా కొమ్ము కాసిందో, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై ఎంత దుమ్మెత్తి పోసిందో నాకు తెలుసు. తమ పార్టీని చెండాడుతున్నందుకు నిరసనగా టీవీ 9 చర్చలకు టీడీపీ నుంచి ఎవరూ వెళ్లరాదని కూడా ఆ పార్టీ ఆంక్షలు విధించింది. ఆ దశలో నేను చంద్రబాబుతో టీవీ 9 తరపున చర్చలు జరిపి సమస్య పరిష్కారమయ్యేట్టు చూశాను. సీన్ కట్ చేస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన రవిప్రకాష్ చిద్విలాసంగా కూర్చున్న దృశ్యాలు,వివిధ వేడుకలలో పాల్గొన్న దృశ్యాలు మన ముందున్నవి.కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం రవిప్రకాష్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఏపీ విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013 లో నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన ఇక గ్యారంటీ అని తేలిపోయింది. అయితే విభజన జరగకుండా రవిప్రకాష్ ఢిల్లీలో మకాం వేసి కొందరు కాంగ్రెస్ ప్రముఖులతో మంతనాలు జరిపారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. కేంద్రంలో విభజనపై రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఆయన చాలా కష్టపడినట్టు అప్పట్లో ఆరోపణలు ఉన్నవి. మొత్తంమీద రవిప్రకాష్ తన స్థాయిని మించి ఊహించుకున్నందుకే తాజా పరిణామాలు సంభవించినట్టు కొందరు విశ్లేషిస్తున్నారు.వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ‘శ్రీ సిటీ’ పేరిట .S.E.Z. టీవీ 9 యజమానులకు మంజూరు కావడం వెనుక రవిప్రకాష్ విశేష కృషి ఉన్నది. టీవీ 9 పరపతి ఇంకా ప్రధానంగా పని చేసింది. ఆ ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’ ప్రస్తుతం ఎన్ని వేల కోట్ల విలువ చేస్తుందో తెలియదు. 2003-2004 ప్రాంతాల్లో 10 – 15 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన టీవీ 9 తెలుగు న్యూస్ ఛానల్ మరికొన్ని భాషలకూ విస్తరించడం, ఆ సంస్థ దాదాపు 600 కోట్ల విలువకు చేరుకోవడం మామూలు విషయం కాదు. దీని వెనుక రవిప్రకాష్ కష్టార్జితం ఉందనే విషయంలో వివాదం లేదు.అలాగే రాజకీయ నాయకులు, పార్టీల పట్ల కూడా రవిప్రకాష్ విధేయతలు, ప్రాధాన్యతలూ వేగంగా మారుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘ఓదార్పుయాత్ర’ తొలి దశ నాటికి (పశ్చిమగోదావరి, ఖమ్మం వగైరా ప్రాంతాలు) వై. ఎస్. జగన్ తో రవిప్రకాష్ కు సత్సంబంధాలు ఉండేవి. ఏ కారణంగానో ఇచ్ఛాపురం నుంచి జరిపిన ‘ఓదార్పు యాత్ర ‘ నాటికి ఇరువురి మధ్య బద్ధ వైరం నెలకొన్నది. స్నేహం, శత్రుత్వంగా మారడానికి గల కారణాలను రవిప్రకాష్ చెప్పడు. జగన్ కూడా వెల్లడించే అవకాశాలు లేవు. ఇక టీడీపీతో రవిప్రకాష్ 2014 నుంచి వ్యవహరిస్తున్న తీరు పట్ల, మైత్రీ సంబంధాల తీరు విషయంలో జగన్ కు సహజంగానే పట్టరాని కోపమూ వచ్చి ఉంటుంది. మే 8,9 తేదీల నుంచి జగన్ న్యూస్ ఛానల్ నుఫాలో అవుతున్న వారికి ఇది సులభంగా అర్ధమవుతుంది. అలాగే రవిప్రకాష్ కేసులకు సంబంధించిన వార్తా ప్రసారాల విషయంలో ఈటీవీ రామోజీరావు, ఎబిఎన్ రాధాకృష్ణ కూడా మినహాయింపు ఇవ్వకపోవడం గమనించదగిన విషయం.