మా అమ్మకు ఎలాంటి సమన్లు రాలేదు

మా అమ్మకు ఎలాంటి సమన్లు రాలేదు

robert vadra

తన తల్లికి ఈడీ నుంచి ఎలాంటి సమన్లు రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. 75 ఏళ్ల తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెను అనవసరంగా వివాదాల్లోకి ఈడుస్తున్నారని వాద్రా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంచలనాల కోసం మీడియా ఆమె పేరుని ఇష్టం వచ్చినట్టు పైకి ఎగదోయడం .. ఒక వృద్ధురాలిని వేధింపులకు గురి చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.

తను కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తూ కోరిన వివరాలన్నీ సమర్పించినట్టు చెప్పారు. కోర్టులో, కోర్టు బయట అవే మాటలు చెబుతూ వస్తున్నానని వాద్రా అన్నారు. ఒక దాని వెంట ఒకటిగా కుంభకోణాల్లో కూరుకుపోతున్న ప్రభుత్వం తన కుటుంబాన్ని వేధించే నిస్సహాయ స్థితిని తాను అర్థం చేసుకోగలనని వాద్రా అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాను ఏ స్థాయి వరకు ఉపయోగిస్తారో తనకు బాగా తెలుసని, కానీ తమ ప్రతీకారం కోసం ఓ 75 ఏళ్ల మహిళను కూడా వివాదాల్లోకి లాగడం చూసి షాకవుతున్నానని తెలిపారు.

రాజస్థాన్ బికనేర్ జిల్లాలో ఉన్న కోలాయత్ తహసీల్ ప్రాంతంలోని 275 బీఘాల భూమి కొనుగోలు వివాదంలొ రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్ వాద్రాతో సహా స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్ భాగస్వాములందరినీ ఫిబ్రవరి 12న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా రాజస్థాన్ హైకోర్ట్ ఆదేశించింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. ఇంతకు ముందు గత ఏడాది నవంబర్ లో ఈడీ రాబర్ట్ వాద్రా, భాగస్వామి మౌరీన్ వాద్రాకు మూడోసారి సమన్లు జారీ చేసింది. కానీ వాళ్లు ఈడీ ముందు హాజరు కాలేదు.