రానంటే రూ.25,000 జరిమానా!!

న్యూఢిల్లీ:

స్మార్ట్ ఫోన్ లో మొబైల్ యాప్ ద్వారా ఓలా, ఊబర్ ట్యాక్సీలు బుక్ చేసుకోవడం చాలా సులువై పోయింది. మనం క్యాబ్ బుక్ చేసిన తర్వాత చివరి నిమిషంలో డ్రైవర్ మన రైడ్ క్యాన్సిల్ చేయడం మనలో చాలా మందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. అలా రైడ్ క్యాన్సిల్ అయినపుడు పడే కష్టాలు వర్ణనాతీతం. ప్రయాణికులకు ఇలాంటి పరిస్థితి తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. చివరి నిమిషంలో రైడ్ కేన్సిల్ చేసే ఓలా, ఊబర్ ట్యాక్సీ డ్రైవర్లకు రూ.25,000 వరకు జరిమానా వేసే ఆలోచనలో ఉంది కేజ్రీ సర్కార్.
క్యాబ్ లపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమవుతున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా యాప్ బేస్డ్‌ క్యాబ్ యాగ్రిగేటర్లకు చెందిన డ్రైవర్లు రావడానికి నిరాకరిస్తే వారిపై రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. ఇదొక్కటే కాదు.. డిమాండ్ ఎక్కువగా ఉన్నపుడు యాగ్రిగేటర్ సర్వీసులు ఇబ్బడిముబ్బడిగా పెంచేసే సర్జ్ ఛార్జీల నియంత్రణ, ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తయారైన ఒక ముసాయిదా తీర్మానానికి తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలిసింది.

క్యాబ్ లో వేధించినా, దురుసుగా ప్రవర్తించినట్టు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే ఆ డ్రైవర్ పై చర్య తీసుకోవాల్సిందిగా యాగ్రిగేటర్ పోలీసు కేసు నమోదు చేయించాలి. అలా చేయకపోతే కంపెనీపై రూ. 1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. యాగ్రిగేటర్లు తమ ఇష్టం వచ్చినట్టు సర్జ్ ప్రైసింగ్ వేయకుండా రవాణా శాఖ నిర్ణయించిన కనిష్ఠ, గరిష్ఠ ఛార్జీలను పాటించాలి. రేట్ల పరిమితిని మించితే వారిపై రూ.25,000 జరిమానా వేస్తారు. యాగ్రిగేటర్లు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి క్యాబ్ లో లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం అమర్చుకోవడం తప్పనిసరి చేయనున్నారు.