కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అరెస్ట్.

Rss

తిరువనంతపురం:

శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తులపై పోలీసుల దురాగతాలపై సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా నల్ల దుస్తుల్లో ఉన్న అయ్యప్ప భక్తుడిని పోలీస్ అధికారి బూటు కాలితో తన్నిన ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో నకిలీదని గుర్తించారు. కేరళ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడన్న అభియోగంపై సోమవారం మన్నార్ పోలీసులు మన్నార్ జిల్లా చెంబకపల్లి నివాసి అయిన 39 ఏళ్ల రాజేష్ ఆర్ కురుప్ ని అరెస్ట్ చేశారు. మీడియాకి అందిన సమాచారం ప్రకారం ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రాజేష్ తనను పోలీసులు తన్నారని ఆరోపిస్తూ ఫోటోల ద్వారా ప్రచారం సాగించాడు. రాష్ట్ర పోలీసుల దురాగతాలకు సాక్ష్యంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు నకిలీవని.. ఓ ఫోటో షూట్ లో తీసినట్టు గుర్తించారు. ఫోటోలు తీసిన స్టూడియో ఫోటోపై తన వాటర్ మార్క్ వేయడంతో ఇది నకిలీ ప్రచారమని తేలింది. చినికిచినికి గాలివానగా మారిన వివాదం తనవైపే తిరిగిందని గుర్తించిన రాజేష్ ఫోటోలను డిలిట్ చేశాడు. వైరల్ గా మారిన ఫోటోల్లో రాజేష్ అయ్యప్ప భక్తుడి మాదిరిగా నల్లని లుంగీ కట్టుకొని భుజాలపై నల్లని కండువా, తలపై ఇరుముడి కెట్టుతో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకొని ఉన్నాడు. అతని ఛాతిపై ఒక పోలీస్ అధికారి బూటు కాలితో తంతున్నాడు. రెండో ఫోటోలో పోలీస్ లాఠీతో కొడుతున్నారు. ఇది ఫేక్ అని గుర్తించిన చెన్నితాల ప్రాంత డీవైఎఫ్ఐ సెక్రటరీ ఎస్. శరత్ బాబు అళప్పుజ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజేష్ ని అరెస్ట్ చేశారు. అతనిపై 153, 500 సెక్షన్ల కింద, కేరళ పోలీస్ చట్టంలోని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 118, 120 కింద కేసు నమోదైంది. రాజేష్ తన ఫోటోలు నకిలీవని అంగీకరించాడు. అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం సైబర్ సెల్ కు పంపించారు.