ఈ-పాస్ పోర్ట్ దిశగా భారత్ అడుగులు

ప్రాధాన్యత ఆధారంగా ఈ-పాస్ పోర్ట్ ల జారీకి తమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణ పత్రాలను అడ్వాన్స్ డ్, వాటి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ-పాస్ పోర్ట్ లు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఏడో పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా మాట్లాడుతూ చిప్ ఎనబుల్డ్ ఈ- పాస్ పోర్టులు జారీ చేసే ప్రాజెక్ట్ గురించి ఇండియా సెక్యూరిటీ ప్రెస్ తో విదేశాంగ మంత్రిత్వశాఖ చర్చలు ప్రారంభించినట్టు జైశంకర్ వివరించారు. ‘మేము ప్రాధాన్యత ఆధారంగా ఈ-పాస్‌ పోర్ట్ లు తయారు చేయాలని ప్రతిపాదించాము. దీనివల్ల భవిష్యత్తులో అధునాతన భద్రతా సౌకర్యాలతో పాస్ పోర్ట్ తయారు చేయవచ్చు’ అని చెప్పారు.

ప్రతి ఏడాది సగటున ఒక కోటికి పైగా పాస్ పోర్టులు జారీ అవుతున్నాయని, జనవరి 2017 నుంచి 412 పీఓపీఎస్కేలను ప్రారంభించినందుకు కమ్యూనికేషన్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.గత పదవీకాలంలో ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో కొత్త పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం (పిఒపిఎస్కే)ని ప్రారంభించే ప్రక్రియను తమ మంత్రిత్వశాఖ కొనసాగిస్తుందని ఆయన అన్నారు.

గత ఐదేళ్లలో పాస్ పోర్ట్ సేవలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా బాగా పని చేసిందని జైశంకర్ తెలిపారు. సుపరిపాలన, పారదర్శక, నైపుణ్యంతో, సమయానుసారంగా, సమర్థవంతంగా పని చేయడానికి విదేశాంగ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని అన్నారు.