‘శబరిమల గొడవ సువర్ణావకాశం‘

sabarimmala

కేరళ బీజేపీ చీఫ్.
తిరువనంతపురం:

శబరిమల అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశంపై బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ బట్టబయలైంది. ఇది పార్టీకో ‘బంగారం లాంటి అవకాశమ‘ని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై చెబుతున్న ఆడియో క్లిప్పింగ్ బయటపడి వివాదాస్పదంగా మారింది. ఇప్పుడీ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో క్లిప్ లో శబరిమల ఆలయ ప్రధాన పూజారి (తంత్రి) అక్టోబర్ 19న మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గర్భగుడి మూసేస్తానని చెప్పారు. దీంతో ఈ వివాదాన్ని రాజకీయం చేసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడంలో బీజేపీ హస్తం ఉందనే విషయం స్పష్టమైంది. వైరల్ గా మారిన వివాదాస్పద ఆడియో క్లిప్ కోజికోడ్ లో యువమోర్చా రాష్ట్ర కమిటీ సమావేశంలో పిళ్లై ప్రసంగంలోనిదని తెలిసింది. శబరిమల ఆలయ తంత్రి కందరారు రాజీవరు ఆలయ ద్వారాలు మూసేయాలని భావించారు. కానీ అది కోర్టుధిక్కార నేరం అవుతుందనే భయంతో ముందుగా తనతో మాట్లాడినట్టు పిళ్లై తెలిపారు.
‘తంత్రి వర్గానికి బీజేపీ, దాని రాష్ట్ర అధ్యక్షుడిపై ఎక్కువ విశ్వాసం ఉంది. శబరిమలలోకి మహిళలు ప్రవేశించడానికి ముందు ఆయన నాతో మాట్లాడారు. నేను ఆయనకు మాట ఇచ్చాను. యాదృచ్ఛికంగా అదే నిజమైంది. గర్భగుడి తలుపులు మూసేయడంపై ఆయన కొంత కలత చెందారు. అది కోర్టుధిక్కారం అవుతుందని భయపడ్డారు. ఆయన మాట్లాడిన అతి కొద్దిమందిలో నేనున్నాను. చట్టపరంగా చర్యలు చేపడితే ఆయన ఒంటరి కారని.. వేలాది బీజేపీ శ్రేణులు కూడా ఆయన వెంట ఉంటాయని భరోసా ఇచ్చాను. నా మాటతో ఆయన ధైర్యం చేసి గట్టిగా నిలబడ్డారు. దీంతో పోలీసులు, అధికార యంత్రాంగం నిశ్చేష్టులయ్యాయి. మరోసారి కూడా ఆయన అలాగే చేస్తారని ఆశిద్దాం. ఆ తర్వాత కోర్టుధిక్కారం కింద నేను మొదటి ముద్దాయి ఆయన రెండో ముద్దాయి అయ్యాము. దీంతో ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింద‘ని పిళ్లై చెప్పారు.

తన మాటల ఆడియో క్లిప్ వైరల్ కాగానే పిళ్లై వెనక్కి తగ్గారు. తను రాజకీయ నాయకుడిగా, న్యాయ కోవిదుడిగా న్యాయ సలహా మాత్రం ఇచ్చానన్నారు. ‘సువర్ణావకాశం‘ మాట మీద వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ క్లిప్ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మండిపడ్డారు. ‘బీజేపీ అసహ్యమైన రాజకీయాలు, మోసపూరిత విధానాలు బట్టబయలయ్యాయ‘ని ట్వీట్ చేశారు. ‘శబరిమలలో శాంతిభద్రతల సమస్య రాజేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారనడానికి సాక్ష్యాలు వెలుగు చూశాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఈ కుతంత్రంలో పాలుపంచుకోవడం గమనార్హం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాన‘ని తెలిపారు.