గ్రామ పర్యటనలో సచిన్ పైలెట్ బిజీ

గ్రామ పర్యటనలో సచిన్ పైలెట్ బిజీ

రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య విభేదాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తన కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఓటమికి సచిన్ పైలెట్ కారణమని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. అయితే ఇవేమీ పట్టనట్టు సచిన్ పైలెట్ ఇప్పుడు రెండు రోజుల పాటు రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడైన సచిన్ మరోసారి రాష్ట్ర ప్రజానీకాన్ని కలుసుకొనేందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం జాలోర్ జిల్లాలోని కాసెలా గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లారు.

కాసెలా గ్రామానికి చెందిన జై కిషన్ అనే రైతు పొలంలో సచిన్ పైలెట్ రాత్రి గడిపారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన సాధారణ పౌరుడి మాదిరిగా కలిసిపోయారు. రాత్రంతా వాళ్లతో మాటామంతి కలపడంతో పాటు ఆకాశం కింద నులక మంచంపై కూర్చొని భోజనం చేశారు. సచిన్ పైలెట్ తన ఈ పర్యటనలో స్థానికులను వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

‘రాజస్థాన్ ప్రజల ప్రేమాభిమానాలే నా బలం. రెండేళ్ల క్రితం కాసెలా గ్రామంలోని రైతు జైకిషన్ ఇంట్లో రాత్రి బస చేశాను. అప్పుడే మరోసారి వస్తానని ఆయనకు మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఆ వాగ్దానం నిలుపుకున్నానని’ సచిన్ పైలెట్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ పర్యటనలో సచిన్ పైలెట్ స్థానికులతో ఫోటోలు తీయించుకున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలతో కూడా ఫోటోలు దిగారు. స్థానికులతో నులక మంచంపై కూర్చొని చాయ్ తాగుతూ చర్చలు జరిపారు. సచిన్ ఒక గుడిసెలో భోజనం కూడా చేశారు. తన ట్వీట్ లో ఈ ఫోటోలన్నీ ఆయన షేర్ చేశారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య సత్సంబంధాలు లేవు. ముఖ్యమంత్రి గెహ్లాట్ తన కుమారుడు ఎన్నికల్లో ఓడిపోవడానికి సచిన్ పైలెట్ కారణమని ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కాకుండా తమ కుమారులను గెలిపించుకోవడంపై దృష్టి పెట్టినందువల్లే ఇలా జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నట్టు వార్తలు వచ్చాయి.