మాజీ ఐపీఎస్ కు జీవితఖైదు

గుజరాత్ లోని ఒక కోర్టు గురువారం మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1990లో కస్టడీలో జరిగిన మృతి కేసులో మాజీ ఐపీఎస్ కు జీవితఖైదు వేసింది. జామ్ నగర్ లోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీ ఎన్ వ్యాస్ భట్ ను దోషిగా నిర్ధారించారు. కానీ కేసులో దోషులుగా పేర్కొన్న ఆరుగురు ఇతర పోలీసు సిబ్బందికి ఇంకా శిక్ష విధించలేదు. 1990లో భట్ గుజరాత్ లోని జామ్ నగర్ లో అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నపుడు ఈ సంఘటన జరిగింది.

ఆయన జామ్ జోధ్ పూర్ పట్టణంలో మత కలహాలు జరిగిన సందర్భంలో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుదాస్ వైష్నానీ అనే వ్యక్తిని కస్టడీ నుంచి విడుదల చేసిన తర్వాత ఆస్పత్రిలో మరణించాడు. వైష్నానీ సోదరుడు భట్, ఆరుగురు ఇతర పోలీస్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, తన సోదరుడిని కస్టడీలో దారుణంగా హింసించిన కారణంగానే చనిపోయాడని ఆరోపించారు.