ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచార యత్నం

గోదావరిఖని:

మొన్న వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం..హత్య. నిన్న హైదరాబాద్‌లో 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యం. ఈ ఘటనలను మరవక మునుపే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఐదో తరగతి విద్యార్థినిపై బడిలోనే స్వీపర్‌ అఘాయిత్యానికి యత్నించాడు. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
గోదావరిఖనిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 21న యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. అప్పటికి ఎవరూ బడికి రాకపోవడంతో ఒంటరిగా తరగతి గదిలో కూర్చుంది. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేసే 50 ఏళ్ల వ్యక్తి ఇదే అదనుగా బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా ఏడవడంతో పారిపోయాడు. దీంతో బాలిక బడికి వెళ్లనంటూ మొరాయించింది. తల్లిదండ్రులు ఆరాతీయగా అసలు విషయం చెప్పింది. ఆగ్రహించిన వారు నిందితునికి దేహశుద్ధి చేశారు. స్వీపర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈవో ప్రకటించారు. నిందితునిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో, కులదూషణ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ పర్స రమేశ్‌ పేర్కొన్నారు.