కుంతియాకు షాక్. తెలంగాణ కాంగ్రెస్‌‌కు కొత్త ఇన్‌ఛార్జ్!! రేపు సీ ఎల్పీ నేత ఎన్నిక.

కుంతియాకు షాక్.
తెలంగాణ కాంగ్రెస్‌‌కు కొత్త ఇన్‌ఛార్జ్!!
రేపు సీ ఎల్పీ నేత ఎన్నిక.

Telangana Congress New CLP Elected.?

హైదరాబాద్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసససభాపక్ష నేత ఎన్నిక ప్రక్రియకు కుంతియాను దూరం పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన స్థానంలో కె.సి.వేణుగోపాల్‌ను రంగంలోకి దింపింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కుంతియాను ఆ పార్టీ హైకమాండ్ మెల్లిమెల్లిగా పక్కకు పెట్టే ప్రయత్నాలు చేస్తోందా ? సీఎల్పీ నేత ఎన్నికతో ఈ రకమైన సంకేతాలను ఇస్తోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాధారణంగా రాష్ట్రాల్లోని సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియను ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లే చూస్తుంటారు. కానీ… తెలంగాణలో మాత్రం ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సీఎల్పీ పదవి ఆశిస్తున్న జాబితా పెద్దగా ఉండటంతో… ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.సబితా ఇంద్రారెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు సీఎల్పీ నేత పదవి ఆశిస్తున్న వారి లిస్టులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సబితా ఇంద్రారెడ్డి సహా కొందరు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో… కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత ఎన్నిక అంశం అగ్ని పరీక్షగా మారింది. సీఎల్పీ నేతను ఎన్నుకునే అందరితో సంప్రదింపులు జరపని పక్షంలో… మరోసారి దీనిపై అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌లోని చర్చ జరుగుతుంది. టికెట్ల కేటాయింపు సందర్భంగా కుంతియా సరిగ్గా వ్యవహరించలేదని కాంగ్రెస్‌లో ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఆయన పట్ల అనేక మంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ సీఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియను కుంతియా చేపడితే… ఆ సందర్భంగా మరోసారి రచ్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్‌కు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఏఐసీసీ నేత కె.సి.వేణుగోపాల్‌ను కాంగ్రెస్ అధిష్టానం అదేశించింది. దీంతో రంగంలోకి దిగుతున్న వేణుగోపాల్… ముందుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ నేత ఎన్నిక అంశంపై చర్చలు జరపబోతున్నట్టు సమాచారం. కేవలం సీఎల్పీ నేత ఎన్నికకు మాత్రమే పరిమితం కాకుండా… పార్టీ మారే ఆలోచనలో ఉన్న వారితోనూ వేణుగోపాల్ చర్చలు జరుపుతారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో… అధిష్టానం వారిని బుజ్జగించేందుకే వేణుగోపాల్‌ను రంగంలోకి దింపుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి సీఎల్పీ నేత ఎన్నిక కోసం వస్తున్న కె.సి.వేణుగోపాల్… కుంతియా స్థానాన్ని రీప్లేస్ చేస్తారా లేక సీఎల్పీ నేత ఎన్నికకు మాత్రమే పరిమితమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.